● పెరిగిన వంట గ్యాస్ ధరలు ● గృహ సిలిండర్‌కు రూ.60, కమర్షియల్‌పై రూ.110 పెంపు ● జిల్లా వాసులపై రూ.26.11 కోట్ల అదనపు భారం ● ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో పాటు సామాన్యుల ఇక్కట్లు
పేదలపాలిట
జిల్లాలో వంట గ్యాస్ సమస్యపై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గల్ఫ్ యుద్ధం కారణంగా ఇతర దేశాల నుంచి గ్యాస్ సరఫరా రోజురోజుకు తక్కువగా రావడంతో ఉన్న గ్యాస్‌ను గృహాలకు మాత్రమే పంపిణీ చేసేందుకు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. గ్యాస్ కొరతతో పాటు ధరలు పెంచడంతో కర్రల పొయ్యి పరిస్థితే మళ్లీ దాపురిస్తుందేమోనని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనకాపల్లి : జిల్లాలో 24 మండలాల్లో ఇండేన్, హెచ్‌పీ, బీపీసీ గ్యాస్ ఏజెన్సీలు 24 ఉండగా, డొమెస్టిక్, కమర్షియల్ కనెక్షన్లు సుమారుగా 5.10 లక్షలు ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ప్రధానంగా అనకాపల్లి, నర్సీపట్నం కేంద్రాలు కాగా రెండు ప్రాంతాల్లో మాత్రమే కమర్షియల్ హాటళ్లు, దుకాణాలు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు సుమారుగా 15 రోజులు జిల్లాలో కమర్షియల్ దుకాణదారులకు గ్యాస్‌ను పూర్తిగా నిలుపుదల చేశారు. డొమెస్టిక్ వినియోగదారులకు మాత్రమే గ్యాస్‌ను సరఫరా చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో రూరల్ ప్రాంతం కావడంతో ఎక్కువగా గ్యాస్ కొరత లేకుండా పోయింది. గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ కొంతమంది గృహాల్లో డొమిస్టిక్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నప్పటికీ కట్టెలు పొయ్యిను మాత్రమే వినియోగిస్తున్నారు. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధ ప్రభావంతో జిల్లాలో ఇతర ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ సమస్య ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. సిలిండర్ల కోసం వినియోగదారులు వారి వాహనాలకు గ్యాస్ బండలను కట్టుకుని లేదా ఆటోలో వేసుకుని మోసుకుంటూ కంపెనీలకు చేరుకుంటున్నారు. గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు సిలిండర్లను బ్లాక్‌లో వేలాది రూపాయలకు అమ్ముకుంటూ గ్యాస్ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
ఏజెన్సీల బాట...
ఓ వైపు డొమెస్టిక్ గ్యాస్ సరఫరా సజావుగానే జరుగుతోందని ప్రభుత్వం చెబుతున్నా జిల్లాలో అటువంటి పరిస్థితి కనబడడం లేదు. ఏజెన్సీ నిర్వాహకులు డోర్ డెలివరీ చేయకపోవడంతో సమస్య మరింత పెరుగుతుందని అంచనాలు వేస్తున్నారు. గ్యాస్ లోడు ఆటోలను డెలివరీకి పంపకుండా కంపెనీల వద్దే ఉంచుకుంటున్నారు.
మొరాయిస్తున్న గ్యాస్ కంపెనీల సర్వర్‌లు....
గతంలో వినియోగదారులు వారి ఇంటి వద్దనే వారికి నచ్చిన సమయంలో గ్యాస్‌బుక్ చేసుకుంటే ఒకటి, రెండు రోజుల్లో గ్యాస్ డెలివరీ బాయ్స్ తీసుకుని వచ్చేవారు. గ్యాస్ కంపెనీల సర్వర్‌లు రోజురోజుకు మొరాయిస్తున్నాయి. గత నెల బుక్ చేసుకున్న వినియోగదారులకు మాత్రమే మార్చి మాసంలో గ్యాస్ సరఫరా చేస్తున్నట్టు ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. గతంలో గ్యాస్ బుక్ చేసుకున్న సెకన్‌ల్లో ఓటీపీ వచ్చేది. ప్రస్తుతం గ్యాస్ బుక్ చేసుకోవాలంటే సర్వర్‌తో సుమారుగా రెండు, మూడు రోజులు కుస్తీ పట్టే పరిస్థితి ఏర్పడుతుంది.
మండుతున్న గ్యాస్ ధరలు...
పెరిగిన గ్యాస్ ధరలతో డొమెస్టిక్, కమర్షియల్ వినియోగదారులకు ఇబ్బందులు తప్పడంలేదు. డొమెస్టిక్‌పై రూ.60, కమర్షియల్‌పై రూ.110 ధరలు పెంచారు. జిల్లా వాసులపై సుమారుగా రూ.26.11 కోట్ల అదనపు భారం పడుతుంది. ఇప్పటికే పెరిగిన నిత్యవసర ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే గ్యాస్ ధరలు పెరగడంతో మరింత భారం పడింది.


