అనకాపల్లి : నూకాంబిక అమ్మవారు నెలరోజుల ఉత్సవంలో భాగంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక గవరపాలెం కొత్త అమావాస్య జాతరను పురస్కరించుకుని బుధవారం ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మవారి నూతన ఆలయాన్ని రూ.15 కోట్లతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఎంతో ఘనకీర్తి కలిగిన అమ్మవారి ఆలయ నిర్మాణం పూర్తి చేయడంతో పాటుగా తొలి అమావాస్య సందర్భంగా నిర్వహించే జాతరలో పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనందంగా ఉందన్నారు. గత ఏడాది అమ్మవారి ఉత్సవాన్ని రాష్ట్రపండగగా గుర్తింపు ఇవ్వడంతో నెల రోజుల పాటు పట్టణంలో ఎన్టీఆర్ క్రీడామైదానంలో సాయంత్రం సమయంలో పలు రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, కలెక్టర్ విజయకృష్ణన్, జేసీ శౌర్యమాన్ పటేల్, జిల్లా దేవదాయ శాఖ అధికారి ఎల్.సుధారాణి, ఆలయ కార్యనిర్వహణ అధికారి వై. శ్రీధర్, ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


