నవ ఉగాదికి శుభోదయం | - | Sakshi
Sakshi News home page

నవ ఉగాదికి శుభోదయం

Mar 19 2026 7:48 AM | Updated on Mar 19 2026 7:48 AM

● నేడే ఉగాది పండగ..షడ్రుచుల వేడుక ● పూతలేక కానరాని వేప పువ్వు, మామిడి కాయలు ● సామాన్యుడికి అందనంతగా ధరలు

నక్కపల్లి : విశ్వావసు నామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ పరాభవ నామ సంవత్సరానికి శుభ స్వాగతం పలికే వేళ ఇది. ఏటా చైత్ర మాసం శుక్లపక్షంలో పాడ్యమి తిథినాడు ఆనవాయితీగా జరుపుకునే ఉగాది పండగ వచ్చేసింది. ఈ రోజు నుంచి తెలుగు సంవత్సరం మొదలవుతుంది. ఈ రోజు ఎటు చూసినా పచ్చదనం పుష్కలమైన పంటలు, మానవాళి సౌభాగ్యాలను చాటేందుకు ప్రతి ఇంటి గుమ్మాలను మామిడి తోరణాలతో అలంకరిస్తారు. పిండి వంటలు ఘుమఘుమలతో జిహ్వను సంతప్తిపరుస్తాయి. సాయంత్రం రామాలయాల్లో జరిగే పంచాంగ శ్రవణాల్లో ఈ ఏడాది జరిగే శుభ ఘడియలు ముఖ్య ఘట్టాలు గురించి పండితులు చెప్పే విశేషాలు తెలుసుకొనేందుకు పలువురు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏడాదంతా శుభం కలగాలని పాడి పంటలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటారు. ఉగాది పండగ ప్రకృతిలో మార్పులు తెస్తుంది. తీపి, పులుపు, కారం, వగరు, చేదు, ఉప్పు, కలగలిసిన షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి. వేప చిగురు, లేత మామిడి కాయలు, కొత్త చింతపండు, కొత్త బెల్లం, అరటిపండు, చెరుకుముక్కలతో తయారు చేసేదే ఉగాది పచ్చడి. జీవితంలో లాభం, నష్టం, సుఖం, కష్టం, ఇష్టం, అయిష్టం అనుభూతుల ప్రతీకే ఉగాది పచ్చడి. ఉగాది పండగ వేకువజామునుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడతాయి. నక్కపల్లి మండలం ఉపమాకలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో విశ్రాంత తెలుగు పండిట్‌ ఆధ్యాత్మిక ప్రవచకురాలు డాక్టర్‌వేదాల గాయత్రిదేవి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం జరుగుతుంది. వేంపాడు సత్యసాయి మందిరం, చినదొడ్డిగల్లులో శ్రీరామ పంచాయతన ఆలయం, పాయకరావుపేటలో పాండురంగ స్వామి ఆలయం, ఎస్‌.రాయవరం మండలం దార్లపూడి వేంకటేశ్వరస్వామి ఆలయం,కొరుప్రోలు సీతారామస్వామి ఆలయాల్లో పంచాంగ శ్రవణ కార్యక్రమాలు జరుగుతాయి.

ప్రియమైన ఉగాది పచ్చడి...

ఉగాది పచ్చడి సామాన్యులకు ప్రియమయ్యింది. ప్రస్తుతం వేపచెట్ల సంఖ్య తగ్గడంతో గుప్పెడు వేపపువ్వు ధర రూ.30 వరకూ పలుకుతోంది. ఇక మామిడి పూతలు లేకపోవడంతో చిన్నపాటి కాయలను సైతం రూ.30లకు కొనాల్సి వస్తోంది. చింత పండు కిలోరూ.120, బెల్లం కిలో రూ.60, వేపిన శనగ పప్పు కిలో రూ.100, కందిపప్పు కిలోరూ120, పంచదార కిలో రూ.45 పెట్టి కొనాల్సి వస్తోంది. అరటిపండ్లు డజను రూ.80. ఇక ఈ ప్రాంతాల్లో చెరకు సాగు దాదాపు కనుమరుగయింది. దూర ప్రాంతాల నుంచి తెచ్చి విక్రయించిన చెరకు ముక్కలను కొనుగోలు చేసి ఉగాది పచ్చడిలో వాడేందుకు సిద్ధమవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement