బిసాటి భరత్
అనంతపురం కల్చరల్: గతంలో అనేక సందర్భాలలో అనంత ఖ్యాతిని చాటుతూ జాతీయ వేదికలపై రాణించిన జిల్లాకు చెందిన బిసాటి భరత్ మరో జాతీయ అత్యున్నత పురస్కారానికి ఎంపికయ్యారు. జనవరి 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగే 27వ జాతీయ యువజనోత్సవాల్లో ప్రధాని మోదీ చేతుల మీదుగా అవార్డునందుకోనున్నారు.
ఈ మేరకు భారత ప్రభుత్వం తరఫున యువజన వ్యవహారాల శాఖ సమాచారాన్ని వెలువరించింది. పుట్లూరు మండలం కందికాపులకు చెందిన ఆదినారాయణ, చంద్రికాదేవి దంపతుల కుమారుడు భరత్ పుట్టింది నిరుపేద కుటుంబమే అయినా స్వీయ ప్రతిభతో రాణించి ఎస్కేయూ, ఇందిరాగాంధీ యూనివర్సిటీలలో రెండు పోస్టు గ్రాడ్యుయేషన్లు పూర్తి చేశారు. 2014 నుంచి ప్రగతి పథం యూత్ అసోసియేషన్ స్థాపించి నెహ్రూ యువకేంద్రం ద్వారా అనేక కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటూ వచ్చారు.
మై గవర్నమెంట్ జాతీయ ప్రచారకర్తగా ప్రభుత్వాలు అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలపై గ్రామీణులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేథప్యంలో ఆయన రాష్ట్రపతి చేతుల మీదుగా ఎన్‌ఎస్‌ఎస్ అవార్డుతో పాటు మరెన్నో జాతీయ అవార్డులను, రివార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను నెహ్రూ యువకేంద్ర డీడీఓ శ్రీనివాసులు, సాహిత్యభారతి గౌరవాధ్యక్షుడు డాక్టర్ పతికి రమేష్ నారాయణ, డాక్టర్ ఉమర్ ఆలీషా సాహితీ సమితి అధ్యక్షుడు పండిట్ రియాజుద్దీన్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment