రైతులను ఆదుకోని ప్రభుత్వం
అనంతపురం అర్బన్: రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రైతు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తరిమెల నాగరాజు, ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు. రబీలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ప్రకటించాలని, మిరప, పత్తి, పప్పుశనగ, విత్తన జొన్నకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట పంట ఉత్పత్తులతో రైతులతో కలిసి ధర్నా చేశారు. రైతు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ ఖరీఫ్, రబీలో పండించిన మిరప, పత్తి, సీడ్ జొన్న, పప్పుశనగ పంటలకు గిట్టుబాటు ధరలేక దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రబీలో దాదాపు 57 వేల హెక్టార్లలో పప్పుశనగ సాగు చేశారన్నారు. అతివృష్టి, అనావృష్టి కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఎకరాకు దిగుబడి రెండు నుంచి మూడు క్వింటాళ్లు కూడా రాలేదన్నారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.20 వేల పరిహారం ఇవ్వాలన్నారు. మద్దతు ధర క్వింటాలు రూ.5,560ను రూ.10 వేలకు పెంచి కొనుగోలు చేయాలన్నారు. పత్తి పంట మద్దతు ధర రూ.7,250 నుంచి రూ.10 వేలకు పెంచి షరతులు లేకుండా కొనుగోలు చేయాలన్నారు. విత్తన జొన్న రైతులను ఆదుకునేందుకు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో దళారుల జోక్యం లేకుండా కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మిరపకు గిట్టుబాటు ధర కింటాలుకు రూ.50 వేలు ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. కౌలు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. ధర్నా వద్దకు విచ్చేసిన కలెక్టరేట్ పరిపాలనాధికారి అలెగ్జాండర్‌కు నాయకులు వినతిపత్రం అందజేసి రైతుల పరిస్థితిని వివరించారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బాలరంగయ్య, ఉపాధ్యక్షులు శివారెడ్డి, బీహె చ్ రాయుడు, మధుసూదన్, నాయకులు పొతులయ్య, వెంకటేష్, ఈరప్ప, నారాయణరెడ్డి, నాగమ్మ, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
రైతు సంఘం జిల్లా అధ్యక్షకార్యదర్శుల ధ్వజం
గిట్టుబాటు ధర, పరిహారం కోసం డిమాండ్
కలెక్టరేట్ ఎదుట పంట ఉత్పత్తులతో ధర్నా
Comments
Please login to add a commentAdd a comment