అనంతపురం: కేసుల పేరిట బెదిరింపులకు పాల్పడ్డారు. మాట వినకపోతే కిడ్నాప్ చేస్తా మంటూ భయపెట్టారు. అంతు చూస్తామంటూ హెచ్చరించారు. చివరికి డబ్బు వల వేసి ప్రలోభాలకు గురి చేశారు. అయితే, వైఎస్సార్ సీపీ ఎంపీటీసీల ఆత్మవిశ్వాసం ముందు అవన్నీ పటాపంచలే అయ్యాయి. గుర్తింపునిచ్చిన వైఎస్సార్‌సీపీని వీడే ప్రసక్తే లేదనే కరాఖండిగా చెబుతూ తమ పార్టీ నాయకులనే ఎన్నుకుని జననేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పట్ల అభిమానాన్ని చాటుకున్నారు. జిల్లాలో గురువారం జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అన్ని చోట్లా వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగురవేసింది. కణేకల్లు, కంబదూరులో ఎంపీపీ, ఉరవకొండ, పెద్దపప్పూరు, రాయదుర్గం, యల్లనూరులో వైస్ ఎంపీపీలుగా వైఎస్సార్ సీపీ అభ్యర్థులే ఎన్నికయ్యారు. ఇక.. శ్రీ సత్యసాయి జిల్లాలో రొద్దం మండలాధ్యక్షుడి ఎన్నిక జరగగా, వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. రామగిరి, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నిక నేటికి వాయిదా పడింది. టీడీపీ అరాచకాలను ముందే పసిగట్టిన వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు ఎంపీటీసీలకు దన్నుగా నిలిచి.. వారిలో ధైర్యాన్ని నింపారు.
కంబదూరులో పారని ‘పచ్చ’ పాచిక
కంబదూరు ఎంపీపీ స్థానాన్ని దక్కించుకునేందుకు టీడీపీ కుట్రలు పన్నింది. ఎన్నిక సందర్భంగా ‘పచ్చ’ నాయకులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఎంపీటీసీలను ప్రలోభాలకు గురిచేశారు. ఒక్కొక్కరికి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు ఇస్తామని బేరసారాలు చేశారు. ఈ క్రమంలోనే ‘తెలుగు తమ్ముళ్లు’ ఏకంగా డీఎస్పీ, ఆర్డీఓ వాహనాలపై రాళ్ల దాడికి యత్నించారు. జేబుల్లో కారం పొడి.. రాళ్లతో వచ్చి వీరంగం సృష్టించారు. అరగంట పాటు విద్యుత్‌కు అంత రాయం కలిగించారు. మండలంలోని ఒంటారెడ్డి పల్లి వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ ఏనుముల సోమశేఖర్‌ను ఎన్నికకు అరగంట ముందు గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఆయన ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని వచ్చి ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం గమనార్హం. ఇక.. ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎంపీపీగా రాళ్ల అనంతపురం ఎంపీటీసీ కే. లక్ష్మీదేవి ఎన్నుకుంటూ వైఎస్సార్ సీపీ సభ్యులు ప్రవేశపెట్టిన తీర్మాన ప్రతిని ములకనూరు ఎంపీటీసీ తిమ్మరాజమ్మ చింపివేశారు. దీంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. మరోవైపు ఎన్నిక మధ్యలో ప్రిసైడింగ్ ఆఫీసర్ మద్ది లేటి అస్వస్థతకు గురి కావడం కలకలం రేపింది. వెంటనే ఆయన్ను కంబదూరు ప్రభుత్వ ఆస్పత్రికి..అక్కడ ప్రథమ చికిత్స అనంతరం అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ వెంటనే అక్కడకు చేరుకుని ఎన్నికల అధికారిగా శెట్టూరు తహసీల్దార్ ఈశ్వ రయ్య శెట్టిని నియమించి.. ప్రక్రియను పూర్తి చేయించారు. ఎంపీపీగా లక్ష్మీదేవి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జేసీ ప్రకటించారు.
మిగిలిన చోట్ల ప్రశాంతం..
జిల్లాలో ఒక్క కంబదూరు మినహా అన్ని ప్రాంతాల్లోనూ ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అన్ని చోట్లా వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు బలపరిచిన వారే ఎంపీపీ, వైస్ ఎంపీపీలుగా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఎన్నికల ప్రిసైడింగ్ అధికారుల నుంచి డిక్లరేషన్ అందుకున్నారు. కొత్తగా ఎన్నికైన వారిని పార్టీ నాయకులు సన్మానించారు. కాగా, ఎన్నికల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
జిల్లాలో ఖాళీ అయిన రెండు ఎంపీపీ, నాలుగు వైస్ ఎంపీపీ స్థానాలకు ఉప ఎన్నిక
అన్ని చోట్లా వైఎస్సార్ సీపీ అభ్యర్థులే గెలుపు
‘పచ్చ’ కుట్రలు.. పటాపంచలు
‘పచ్చ’ కుట్రలు.. పటాపంచలు


