ట్రంప్ గెలుపుతో విధ్వంసకర విధానాలు వేగవంతం
● సీపీఎం కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యుడు అరుణ్‌కుమార్ ధ్వజం
అనంతపురం సిటీ: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికై నప్పటి నుంచి విధ్వంసకర విధానాలను అగ్రరాజ్యం వేగవంతం చేసిందని సీపీఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్.అరుణ్‌కుమార్ ధ్వజమెత్తారు. జిల్లా పరిషత్ క్యాంపస్‌లోని డీపీఆర్‌సీ భవన్‌లో సీపీఎం జిల్లా అధ్యక్షుడు ఓ.నల్లప్ప అధ్యక్షతన ‘ట్రంప్ విధానాలు – భారతదేశంపై ప్రభావం’ అనే అంశంపై శనివారం సాయంత్రం నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. పనామా, గ్రీన్‌ల్యాండ్, కెనడా వంటి దేశాలను ఆక్రమించుకునే పద్ధతులను అమెరికా వేగవంతం చేయడంపై మండిపడ్డారు. ఇందులో భాగంగానే ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికై న్పటి నుంచి రోజుకో వివాదాస్పద నిర్ణయాన్ని తీసుకువస్తున్నారని దుయ్యబట్టారు. ఒకవైపు శాంతి నెలకొల్పుతానంటూ ఇజ్రాయెల్ దాడులను తాత్కాలికంగా నిలిపివేయడం, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపినట్లుగా చూపిస్తోందని పేర్కొన్నారు. ఇదంతా శక్తివంతమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న చైనాను నిలువరించే క్రమంలోనే చేపడుతోందని వెల్లడించారు. తన ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచుకునే క్రమంలో ఇండియా, చైనా, కెనడా, మెక్సికో వంటి దేశాలపై ఆంక్షలు విధించేందుకు అగ్రరాజ్యం సిద్ధపడిందన్నారు. ఇండియా టారిఫ్ కింగ్ పేరుతో భారతదేశంపైనా ట్రంప్ ఒత్తిడి పెంచుతున్నట్లు ఆరోపించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్, సీఐటీయూ ఓబులు, నాగేంద్ర, బాలరంగయ్య, సావిత్రి, రామిరెడ్డి, ముర్తుజా, నాగమణి, గేయానంద్ పాల్గొన్నారు.


