దాయాదుల ఘర్షణ – ఇద్దరికి గాయాలు
కళ్యాణదుర్గం: శెట్టూరు మండలం మాలేపల్లిలో ఆస్తి విషయంగా దాయాదుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు... మాలేపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు రామాంజనేయులుకు ఇద్దరు భార్యలున్నారు. ఆస్తి విషయంగా బుధవారం రాత్రి రామాంజనేయులుతో పెద్ద భార్య హనుమక్క, కుమారుడు హనుమంతరాయుడు, అల్లుడు గోపి, మర్రిస్వామి, నాగార్జున నవీన్, కుర్లపల్లి బంధువులు హనుమంతరాయుడు, కోనేరు గొడవ పడ్డారు. ఆ సమయంలో పెద్ద భార్య బంధువులు రామాంజనేయులు, ఆయన చిన్నభార్య ఈశ్వరమ్మపై దాడి చేయడంతో ఇద్దరూ గాయపడ్డారు. ఘటనపై శెట్టూరు పోలీసు స్టేషన్లో ఇరువర్గాలూ ఫిర్యాదు చేసుకున్నాయి. విషయం తెలుసుకున్న వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వసంత్‌కుమార్, కళ్యాణదుర్గం పట్టణ అధ్యక్షుడు ఉద్దీప్‌సింహా, రూరల్ అధ్యక్షుడు మల్లాపురం దొణస్వామి, ప్రతినిధులు నాగరాజు, ఖాజా, రఘుతో పాటు పలువురు రామాంజనేయులుకు బుధవారం రాత్రి కళ్యాణదుర్గంలోని టీ సర్కిల్‌లో ధర్నా చేపట్టారు. కుటుంబ ఆస్తి విషయంలో టీడీపీ నేతలు జోక్యం చేసుకుని, దాడులకు ప్రేరేపించడం సరికాదని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న సీఐ యువరాజు సిబ్బందితో కలసి అక్కడకు చేరుకుని ఆందోళన కారులతో చర్చించారు. సమస్యకు పరిష్కారం చూపుతానని భరోసానివ్వడంతో ఆందోళనను విరమించారు.


