‘ఉపాధి’ లక్ష్యం 1.20 కోట్ల పనిదినాలు
అనంతపురం అర్బన్: ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద 1.20 కోట్ల పనిదినాలు కల్పించాలని లక్ష్యం నిర్దేశించుకున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో 2.12 లక్షల కుటుంబాలకు రూ.287.01 కోట్లు వేతన రూపంలో చెల్లించాం’ అని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ వెల్లడించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో డ్వామా పీడీ సలీమ్‌బాషా, పీఆర్ ఎస్‌ఈ జహీర్ అస్లాంతో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఉపాధి హామీ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. కూలీలకు ఉపాధి, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కింద నీటి నిల్వ, సంరక్షణ పనుల్లో భాగంగా 238 చెరువుల్లో పూడిక తీత, 575 సేద్యపు నీటి కుంటలు, 1,276 కొండల్లో నీటి నిల్వ కందకాలు, 2,347 డిగ్ అవుట్ పాండ్లు, 374 పంట కాలవల్లో పూడికతీత చేపట్టామన్నారు. అలాగే, రూ.73.86 కోట్లతో 194.57 కిలోమీటర్ల సీసీ రోడ్లు, రూ.4.85 కోట్లతో 10.39 కిలోమీటర్ల బీటీ రోడ్లు, రూ.93.60 లక్షలతో 7.25 కిలోమీటర్ల సీసీ కాలువలు, రూ.29.16 కోట్లతో 1,437 పశువుల షెడ్ల నిర్మాణ పనులు జరిగాయన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.20 కోట్ల పనిదినాలు కల్పించి కూలీలకు రూ.375 కోట్లు వేతన రూపంలో చెల్లించాలని లక్ష్యం నిర్దేశించుకున్నామన్నారు. మొదటి త్రైమాసికంలో భాగంగా ఈ నెలలో 24.62 లక్షల పనిదినాలు, మేలో 32.59 లక్షలు, జూన్‌లో 10.79 లక్షల పనిదినాలు మొత్తం 68 లక్షలు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామన్నారు. అదే విధంగా 8 వేల ఎకరాల్లో పండ్లతోటల పెంపకం చేపట్టనున్నామన్నారు. పని ప్రదేశాల్లో కూలీలకు కనీస సౌకర్యాలు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రెండు రోజుల పాటు జిల్లాలో బలమైన గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
కలెక్టర్ వినోద్‌కుమార్


