పూర్తి స్థాయిలో స్పెషల్ అసిస్టెంట్లు
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి మూల్యాంకనం విధులకు స్పెషల్ అసిస్టెంట్లు పూర్తిస్థాయిలో వచ్చారు. 200లోపు అవసరం కాగా... 220 మంది ఉపాధ్యాయులు ఆసక్తి చూపుతూ విధుల్లో చేరడంతో విద్యాశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక కేఎస్‌ఆర్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో గురువారం పదోతరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. ఉదయం 9 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఏఈలుగా నియమించిన పలువురు టీచర్లు వివిధ కారణాలతో ఉత్తర్వులు రద్దు చేసుకునేందుకు తంటాలు పడ్డారు. అలాగే విధుల్లో చేరేందుకు చాలామంది టీచర్లు ఆసక్తి చూపించారు. అన్నింటినీ సర్దుబాటు చేసిన అధికారులు ఎట్టకేలకు మధ్యాహ్నం భోజనం అనంతరం మూల్యాంకనం ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సరిపడా ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. చల్లని తాగునీటి వసతి కల్పించారు. తొలిరోజు ఒక్కొక్కరికి 15–20 పేపర్లు ఇచ్చారు. రెండోరోజు నుంచి ఉదయం 20, మధ్యాహ్నం 20 పేపర్లు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. క్యాంపు ఆఫీసరు, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్‌బాబు, డిప్యూటీ క్యాంపు ఆఫీసర్ (స్ట్రాంగ్‌రూం) గోవిందనాయక్, డిప్యూటీ క్యాంపు ఆఫీసర్ (అడ్మినిస్ట్రేషన్) శ్రీనివాసరావు పర్య వేక్షించారు. పేపర్లు మూల్యాంకనం చేసే అసిస్టెంట్ ఎగ్జామినర్లు (ఏఈ) ఇంగ్లిష్‌కు 150 మంది, తెలుగు 140, హిందీ 120, ఫిజికల్ సైన్స్ 120, బయాలజికల్ సైన్స్ 100, సోషల్ 120 మందిని నియమించారు.
జాగ్రత్తగా దిద్దండి...
పరీక్షలు బాగా రాసిన ఏ ఒక్క విద్యార్థికీ మార్కుల నమోదులో అన్యాయం జరగకూడదని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్‌బాబు స్పష్టం చేశారు. జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు పరిశీలించి మార్కులు వేయాలన్నారు. వేసిన మార్కుల టోటలింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థుల జీవితాలతో ముడిపడిన మూల్యాంకన విషయంలో ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని ఆదేశించారు. విధుల్లో పాల్గొనే టీచర్లకు అన్ని వసతులు ఏర్పాటు చేశామన్నారు. ఏ చిన్న సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని కోరారు.
ఊపిరి పీల్చుకున్న
విద్యాశాఖ అధికారులు
ఆలస్యంగా ప్రారంభమైన టెన్త్ ‘స్పాట్’


