●జిల్లాలో 44 వేల ఎకరాల్లో సాగు ●ఎకరాకు రూ.30 వేలకుపైగా
బొమ్మనహాళ్: ఈ వేసవిలో రైతులు పత్తి పంట వైపు దృష్టి సారించారు. సాధారణంగా ఏప్రిల్ మొదటి వారంలో పత్తి సాగు చేస్తారు. అయితే ఈ ఏడాది మార్చి చివరి వారం నుంచే వ్యవసాయ బోర్లు, బావుల కింద పత్తి సాగు చేస్తున్నారు. వేసవిలో వరి, మిరప, పత్తి మాత్రమే సాగు చేయవచ్చు. జిల్లాలోని బొమ్మనహాళ్, కణేకల్లు, డి.హీరేహాళ్, విడపకల్లు, పెద్దవడూగూరు, యాడికి, పామిడి, శింగనమల, పాల్తూరు, పెద్దపప్పూరు, గుత్తి, తాడిపత్రి, వజ్రకరూరు, ఉరవకొండ తదితర మండలాల్లో 44 వేల ఎకరాల్లో నాయక్, ఆర్మీ, సూపర్ బంటు, నందిని, తేజ తదితర రకాల పత్తి వేశారు. సాగు చేసినప్పటి నుంచి దిగుబడులు వచ్చే వరకు నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది. ముంగారు వర్షాలు రాకపోతే ఎక్కువ తడులు ఇవ్వాల్సి ఉంటుంది. కాపు దశలో వర్షాలు పడితే పంట ఏపుగా పెరుగుతుంది. వేసవిలో మొలకెత్తాక ఉష్ణోత్రగలకు పత్తి దెబ్బతినకుండా తట్టుకుంటుందనే సాగు చేస్తున్నామని రైతులు చెబుతున్నారు. ఎకరాకు రూ.30 వేలకుపైగా పెట్టుబడులు పెడుతున్నారు. సాగు చేసిన నాలుగు నెలలకే దిగుబడులు అందుతాయి. దిగుబడులు ప్రారంభమైన 40 రోజులకు పూర్తిగా చేతికి వస్తాయి. ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల దాకా దిగుబడులు వస్తాయని రైతులు అంచనా వేస్తున్నారు.
ధరలు ఉంటే మంచి ఆదాయమే
పత్తికి మార్కెట్‌లో ధరలు బాగుంటే రైతుకు మంచి ఆదాయం వస్తుంది. గత ఏడాది క్వింటా రూ.7,300 నుంచి రూ.8,200 వరకు ధర పలికింది. ఈ ఏడాది మార్కెట్ ధరలు ఆశాజనకంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.


