‘స్టార్‌’ తిరగబడింది! | - | Sakshi
Sakshi News home page

‘స్టార్‌’ తిరగబడింది!

Apr 8 2025 10:50 AM | Updated on Apr 8 2025 10:50 AM

‘స్టా

‘స్టార్‌’ తిరగబడింది!

తాడిపత్రిలో బోర్డు తిప్పేసిన ఫైనాన్స్‌ సంస్థ

రూ.6 లక్షలతో ఉడాయించిన సంస్థ ఇన్‌చార్జ్‌ భాస్కర్‌

సంస్థ సిబ్బందిని నిలదీస్తున్న బాధితులు

పోలీసులను ఆశ్రయించిన సిబ్బంది, బాధితులు

తాడిపత్రి టౌన్‌: ‘బిజినెస్‌ చేయాలనుకున్నారా?. సొంత ఇల్లు కట్టుకునేందుకు డబ్బులు లేక ఆగిపోయారా? ఇప్పుడు మీ కలలను సాకారం చేసేందుకు స్టార్‌ ఫైనాన్స్‌ మీ ముందుకు వచ్చింది. సిబిల్‌ స్కోర్‌ లేకున్నా మీకు రుణం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’ అంటూ ఊరించి నెల రోజులు తిరగకుండానే బాధితులకు రూ.6 లక్షల కుచ్చుటోపీ పెట్టి తాడిపత్రిలో ఓ ఫైనాన్స్‌ సంస్థ బోర్డు తిప్పేసింది. వివరాలు... తాడిపత్రి మండలం కొండేపల్లికి చెందని సాగిబండ భాస్కర్‌... స్థానిక నంద్యాల రోడ్డులో ఓ గదిని అద్దెకు తీసుకుని స్టార్‌ పైనాన్స్‌ పేరుతో కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. సిబిల్‌ స్కోర్‌ లేకపోయినా వ్యక్తిగత రుణాలు, బిజినెస్‌ లోన్లు, హౌస్‌.. ప్లాట్‌ లోన్లు ఇస్తామంటూ ఆకర్షణీయమైన ఫ్లెక్సీలో విస్తృత ప్రచారం చేశాడు. నెలకు రూ.10వేల వేతనంతో దాదాపు 20 మంది సిబ్బందిని నియమించుకుని ఆర్థిక ఇబ్బందులతో బాదపడుతున్న వారిపై ఉసిగొల్పాడు. ఎదుటి వ్యక్తి అవసరాలను బట్టి రుణం మంజూరుకు సంబంధించి రూ.లక్షకు 6 శాతం చొప్పున ప్రాసెసింగ్‌ పీజును ముందుగానే రాబట్టుకున్నాడు. ఇలా దాదాపు 35 మందితో రూ.6 లక్షలు వసూలు చేసుకుని 30 రోజుల్లోపు రుణం మొత్తం వారి బ్యాంక్‌ ఖాతాలకు జమ అవుతుందని నమ్మబలికాడు. దాదాపు నెల రోజలకు పైగా గడుస్తున్నా బ్యాంక్‌ ఖాతాలకు రుణం మొత్తం జమ కాకపోవడంతో ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించిన పలువురు నేరుగా కార్యాలయానికి చేరుకుని అక్కడున్న సిబ్బందిని నిలదీశారు. దీంతో రేపోమాపో వస్తుందని చెబుతూ వచ్చిన సిబ్బంది సైతం ఫైనాన్స్‌ సంస్థ నిర్వాహకుడు భాస్కర్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో లబోదిబో మంటూ బాధితులతో కలసి సోమవారం ఏఎస్సీ రోహిత్‌కుమార్‌కు సమస్య విన్నవించారు. ఘటనపై పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

‘స్టార్‌’ తిరగబడింది! 1
1/1

‘స్టార్‌’ తిరగబడింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement