తప్పుడు కేసులతో ప్రాణాలు తీస్తున్నారు
కళ్యాణదుర్గం: వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి ప్రాణాలను పొట్టనపెట్టుకుంటున్నారని పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య విమర్శించారు. టీడీపీ నాయకుల ఒత్తిడితో పోలీసులు తప్పుడు కేసు బనాయించడంతో ఆవేదనకు గురై గుండెపోటుతో కళ్యాణదుర్గం మండలం శీబావికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త చాకలి రామాంజనేయులు ప్రాణాలు విడిచాడు. ఈ క్రమంలో రామాంజనేయులు మృతదేహానికి సోమవారం పార్టీ నేతలతో కలిసి రంగయ్య నివాళులర్పించారు. అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంపద సృష్టిస్తామని గొప్పలు చెప్పిన చంద్రబాబు నేడు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారన్నారు. పోలీసులు ఏకపక్షంగా అక్రమ కేసు బనాయించడంతోనే చాకలి రామాంజనేయులు మృతి చెందాడన్నారు. వీటిపై జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఎమ్మెల్సీ బోయ మంగమ్మ మాట్లాడుతూ శీబావిలో ఎన్నడూ లేని సంస్కృతి తీసుకువచ్చారన్నారు.ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు చేసేవాళ్లమని, కానీ నేడు కక్షలు పెంచుకుని అమాయకుల ప్రాణాలతో టీడీపీ నాయకులు చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. రామాంజనేయులు కుటుంబాన్ని వీధి పాలు చేశారని, ఆయన భార్య, పిల్లలకు ఎవరు దిక్కని వాపోయారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని టీడీపీ నాయకులు గుర్తుంచుకోవాలన్నారు. పార్టీ నేత మాదినేని ఉమా మహేశ్వర నాయుడు మాట్లాడుతూ చాకలి రామాంజనేయులది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనన్నారు. కళ్యాణదుర్గం రూరల్ సీఐ వంశీకృష్ణ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు ప్రైవేట్ సైన్యంలా పనిచేస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులే లక్ష్యంగా అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి, నాయకులు నారాయణపురం వెంకటేశులు, నరేంద్రరెడ్డి, మండల కన్వీనర్ గోళ్ల సూరి, చంద్రశేఖర్‌రెడ్డి, సర్వోత్తమ, గోపాల్, సూరప్ప, ఆంజనేయులు, పాతలింగ, మల్లి, మురళి తదితరులు పాల్గొన్నారు.


