దయనీయం.. దౌర్భాగ్యం
● సర్వజనాస్పత్రిలో దిగజారిన సేవలు
● గంటల తరబడి ఎమర్జెన్సీలోనే రోగులు
● ప్రత్యక్ష నరకం చూస్తున్న బాధితులు
● పట్టించుకోని ఉన్నతాధికారులు
అనంతపురం మెడికల్: అనంతపురం సర్వజనాస్పత్రిలో రోజురోజుకూ సేవలు దిగజారుతు న్నాయి. ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గురిని పడుకోబెడుతున్న దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి.ఆస్పత్రికొచ్చే రోగులు ఆర్తనాదాలు పెడుతున్నా పట్టించుకునే నాథుడే కానరావడం లేదు. అత్యవసర కేసులు ఉదయం ఎమర్జెన్సీకి వస్తే సాయంత్రమైనా వార్డులకు తరలించడం లేదు. ఉరవకొండ మండలం గడేహొతూరుకు చెందిన తులసి తలకు గాయంతో సోమవారం ఉదయం 11.30 గంటలకు సర్వజనాస్పత్రికి రాగా, ఇక్కడ ఆమెను సర్జరీ వైద్యులు చూడడానికి దాదాపు 4 గంటల సమయం పట్టింది. ఇదొక్కటే కాదు..ఆస్పత్రిలో తగినన్ని పడకలు లేకపోవడం, వైద్యులు, సిబ్బంది ఇష్టారాజ్యం వెరసి సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న రోగులు నానా అవస్థలు పడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. రోజులో ఒక్కసారైనా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వర రావు, ఏడీ మల్లికార్జున రెడ్డి, ఆర్‌ఎంఓలు ఎమర్జెన్సీ వార్డును పరిశీలించి రోగులను సకాలంలో వార్డులకు పంపేలా చూస్తే సగం కష్టాలు తీరుతాయి. కానీ ఆస్పత్రిలో అటువంటి పరిస్థితి లేకుండా పోయింది.
అమాత్యా.. ఆలకించండి..
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఎమర్జెన్సీ వార్డును పది నిమిషాలు పరిశీలిస్తే.. ఇక్కడ రోగులు నిత్యం ఎంత నరకం అనుభవిస్తారో తెలుస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఆస్పత్రిలో వివిధ విభాగాధిపతులు, అధికారుల మధ్య ఏపాటి సమన్వయం ఉందో, సూపరింటెండెంట్, ఏడీ, ఆర్‌ఎంఓలకు పరిపాలనపై పట్టు ఏమాత్రం ఉందో ఇట్టే తెలిసి పోతుందంటున్నారు.
● వైద్యం కోసం సర్వజనాస్పత్రికి వచ్చిన కూడేరుకు చెందిన సంగప్ప, శెట్టూరుకు చెందిన హనుమంతులను ఒకే మంచంపై ఉంచిన దృశ్యమిది. గుండె సమస్యతో ఇబ్బంది పడుతున్న తరుణంలోనూ చాలీచాలని మంచంపై పడుకోబెట్టడం.. చాలా సేపు వైద్యులు పట్టించుకోకపోవడంతో సంగప్ప నరకయాతన అనుభవించాడు. దయచేసి వార్డుకు పంపండంటూ బోరున విలపించినా సిబ్బంది కనికరం చూపలేదు.
● కురుకుంటకు చెందిన సురేష్ సోమవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కుటుంబసభ్యులు అతడిని వెంటనే సర్వజనాస్పత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో అతడిని సిటీ స్కాన్ రూముకు తీసుకెళ్లేందుకు ఎంఎన్‌ఓలు అందుబాటులో లేరు. దీంతో కుటుంబీకులు, మిత్రులే సురేష్‌ను తరలించాల్సి వచ్చింది.పైగా స్ట్రెచర్‌కు చక్రం లేకపోవడంతో ఎత్తుకుని తీసుకెళ్లారు.
దయనీయం.. దౌర్భాగ్యం


