నేత్రపర్వంగా రథోత్సవం
కణేకల్లు: మండలంలోని యర్రగుంట గ్రామంలో వెలసిన యణ్ణేరంగస్వామి రథోత్సవం సోమవారం నేత్రపర్వంగా సాగింది. రాయదుర్గం, బొమ్మనహళ్, బెళుగుప్ప, డి.హిరేహళ్ తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. ఉదయం నుంచి సాయంకాలం వరకూ విశేష పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. సాయంకాలం 5 గంటలకు స్వామి ఉత్సవమూర్తిని పల్లకీలో ఊరేగిస్తూ రథంపైకి చేర్చారు. మేళాతాళాలు, తపెట్లతో రథాన్ని ముందుకు లాగారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్ యండ్రకాయల వన్నూరప్ప, మాజీ వైస్ ఎంపీపీ పి.సంజీవరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు కెనిగుంట రామిరెడ్డి, పాటిల్ వెంకటరెడ్డి, కె.జె.ఈరన్న, కేజీ వన్నూరుస్వామి, హనుమంతప్ప పాల్గొన్నారు. కాగా, రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన యణ్ణేరంగస్వామి ఉత్సవాలు సోమవారం నాటి రథోత్సవంతో ముగిసాయి.


