ప్రభుత్వ లాంఛనాలతో రమాదేవి అంత్యక్రియలు
కంబదూరు: అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం యర్రగుంట్ల సమీపంలో సోమవారం ఉదయం రెండు కార్లు బలంగా ఢీకొన్న ప్రమాదంలో ఓ కారులో ఉన్న హంద్రీనీవా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె భౌతిక కాయాన్ని స్వగ్రామమైన కంబదూరు మండలం తిమ్మాపురానికి మంగళవారం తీసుకొచ్చారు. అనంతపురం, వైఎస్సార్ జిల్లాల డీఆర్‌ఓలు మలోల, విశ్వేశ్వర నాయుడు, కళ్యాణదుర్గం ఆర్డీఓ వసంత బాబు, కంబదూరు తహసీల్దార్ బాలకిషన్ తదితరులు రమాదేవి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
యువకుడి ఆత్మహత్య
కణేకల్లు: మండలంలోని యర్రగుంట గ్రామానికి చెందిన గొల్ల గంగాధర్ (35) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య సిద్దమ్మ, ఇద్దరు కుమార్తెలు, తల్లి లక్ష్మి ఉన్నారు. కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవారు. ఈ క్రమంలో మద్యానికి అలవాటు పడిన గంగాధర్ రోజూ సంపాదన మొత్తాం తాగుడుకే ఖర్చు పెడుతూ అప్పుల పాలయ్యాడు. ఈ క్రమంలో అప్పులు తీర్చేందుకు ఉన్న ఇంటిని అమ్మేసి, అద్దె గదికి మకాం మార్చారు. అయినా మద్యం తాగడాన్ని మానుకోలేదు. దీంతో తాగుడు మానేస్తే కుటుంబం బాగుపడుతుందని మంగళవారం ఇంట్లో అందరూ మందలించారు. అనంతరం కుటుంబసభ్యులందరూ యణ్ణేరంగస్వామి ఉత్సవాలకు వెళ్లారు. సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న గంగాధర్.. చిన్నారికి వేసిన ఊయల చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి 7 గంటలకు ఇంటికి చేరుకున్న కుటుంబసభ్యులు గమనించి సమాచారం ఇవ్వడంతో పోలీసుల అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
ఉద్యానశాఖ డీడీగా ఫిరోజ్‌ఖాన్
అనంతపురం సెంట్రల్: ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా ఏపీఎంఐపీ ఏపీడీ ఫిరోజ్‌ఖాన్ మంగళవారం బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటి వరకూ పనిచేస్తున్న బీఎంవీ నరసింహారావు మెడికల్ లీవ్‌లో వెళ్లడంతో ఆయన స్థానంలో ఫిరోజ్‌ఖాన్‌కు ఎఫ్‌ఏసీ డీడీగా బాధ్యతలు అప్పగిస్తూ కమిషనరేట్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.


