కఠిన చర్యలు తీసుకోవాలి
అనంతపురం: జేఎన్‌టీయూ (ఏ) పరిధిలో త్వరలో బీటెక్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లింపునకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఆయా కళాశాలల్లోనే నేరుగా పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించడానికి వెళ్తే సిబ్బంది ససేమిరా అంటున్నారు. అనంతలక్ష్మీ ఇంజినీరింగ్ కళాశాల, పీవీకేకే ఇంజినీరింగ్ కళాశాలల్లో కోర్సు ఫీజు ముందస్తుగా చెల్లిస్తేనే పరీక్ష ఫీజు కట్టించుకుంటామని స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులకు సమాచారం అందించగా... అప్పు చేసి వారు ఫీజులు చెల్లిస్తున్నట్లు సమాచారం.
మంత్రి ఆదేశాలు బేఖాతర్..
కోర్సు ఫీజులతో సంబంధం లేకుండా పరీక్షలకు అనుమతించాలని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉత్తర్వులు జారీ చేయగా.. ఆ మేరకు జిల్లా కలెక్టర్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. అయినా మాజీ మంత్రి, టీడీపీ నేత పల్లె రఘునాథ రెడ్డికి చెందిన పీవీకేకే కళాశాలతో పాటు అనంతలక్ష్మీ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యాలు పట్టించుకోకపోవడం గమనార్హం. ఫీజు వసూలే తమ లక్ష్యమనేలా వ్యవహరిస్తూ విద్యార్థులను బెంబేలెత్తిస్తున్నాయి.
ఒక్కసారిగా తలకిందులు..
వాస్తవానికి గడిచిన విద్యా సంవత్సరంలో చివరి రెండు త్రైమాసికాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్, ‘వసతి దీవెన’ నిధులు గతేడాది జూన్‌లో చెల్లించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మళ్లీ వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చి ఉంటే ఆ నిధులు విద్యార్థుల తల్లి దండ్రుల ఖాతాల్లో జమయ్యేవి. కానీ, కూటమి ప్రభుత్వం రావడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. పాత విద్యా సంవత్సరంలో రెండు త్రైమాసికాల బకాయిలు, ఈ విద్యా సంవత్సరంలో పూర్తయిన మూడు త్రైమాసికాలకు కలిపి రూ. 90 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించలేదు. పథకాల పేర్లు మార్చారే కానీ.. నిధుల ఊసే ఎత్తడం లేదు. మరో వైపు ఇళ్లకు దూరంగా హాస్టళ్లలో ఉంటూ చదువుకునే విద్యార్థులకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ‘వసతి దీవెన’ అందించి ఆదుకోగా.. నేడు ఆ పథకాన్నే పూర్తిగా నిలిపేయడంతో అప్పుల భారం పడింది.
వైఎస్సార్ సీపీ పోరుబాటతో..
రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ఇటీవల వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘యువత పోరుబాట’తో కూటమి సర్కారు ఉలిక్కిపడింది. అప్పటికప్పుడు తేరుకుని ఒక త్రైమాసికానికి సంబంధించి రూ.30 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, అందులోనూ పాక్షిక చెల్లింపులే జరిగాయి. దీంతో కళాశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి చేయడం ప్రారంభించాయి. ఉన్నత విద్య, ఉద్యోగాల సమయంలో సర్టిఫికెట్లు తప్పనిసరి కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు చెల్లిస్తున్నట్లు తెలిసింది.
ఫీజుల వేధింపులకు పాల్పడుతున్న ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జేఎన్‌టీయూ (ఏ) పాలక భవనం వద్ద బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నయాపైసా బకాయి పెట్టకుండా మొత్తం ఫీజు చెల్లిస్తామని మంత్రి లోకేష్ చెప్పారని, ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తే కళాశాల గుర్తింపు కూడా రద్దు చేస్తామని ఆయన ప్రకటించినా ఖాతరు చేయకపోవడంలో ఆంతర్యమేమిటో తెలియడం లేదన్నారు. వీసీ ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు మాట్లాడుతూ.. రెండు వారాల క్రితమే అన్ని కళాశాలలకు సర్క్యులర్ జారీ చేశామని, తాజాగా మరో సర్క్యులర్ జారీ చేస్తామని పేర్కొన్నారు. ఫీజులు కట్టాలని విద్యార్థులపై ఒత్తిడి తెస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతూరు పరమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు తరిమెల గిరి, నగర ఉపాధ్యక్షుడు సోము, విజయ్, సాయి, అజయ్ తదితరులు పాల్గొన్నారు.


