బాబు ద్వంద్వ వైఖరిని ఎవ్వరూ నమ్మరు
అనంతపురం కల్చరల్: ముస్లిం మైనార్టీల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రదర్శిస్తున్న ద్వంద్వ వైఖరిని ఎవ్వరూ నమ్మబోరని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా యూజేఏసీ (యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ) ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు రిలే నిరాహారదీక్షలు చేశారు. గురువారం నగరంలోని టవర్‌క్లాక్ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద జరిగిన నిరసన దీక్షలకు అనంత సంఘీభావం తెలియజేసిన అనంతరం మాట్లాడారు. వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల్లోనూ వైఎస్సార్‌సీపీ వ్యతిరేకంగా ఓటు వేసిందని, తమ పార్టీ లౌకికవాదానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బిల్లును సమర్థించిన టీడీపీ నాయకులు.. పార్లమెంటులో బీజేపీకి అనుకూలంగా ఉంటూ పైకి మాత్రం ముస్లింలను నమ్మించడానికి వైఎస్సార్‌సీపీ వైఖరిని తప్పుపడడ్డం వారి దిగుజారుడుతనానికి నిదర్శనమన్నారు. మతోన్మాద రాజకీయాలకు దేశంలో చోటు ఉండకూడదని, టీడీపీ, జనసేన చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. వక్ఫ్ సవరణ బిల్లు దేశానికి ప్రమాదకరమని, ఒక వర్గం వారిని టార్గెట్ చేసినట్లుండే బిల్లును ఉపసంహరించుకోవాలని కోరారు. మేయర్ వసీం మాట్లాడుతూ ముస్లింలతో చర్చలు జరపకుండానే బిల్లును ఏకపక్షంగా తీసుకువచ్చారని, సవరణ బిల్లును తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశం ముక్కలు కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్, సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప, కాంగ్రెస్ నాయకుడు దాదా గాంధీ, ఉర్దూ అకాడమీ మాజీ చైర్మన్ నదీం అహ్మద్, వక్ఫ్‌బోర్డు జిల్లా మాజీ అధ్యక్షులు కాగజ్‌ఘర్ రిజ్వాన్, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ ఏకేఎస్ ఫయాజ్, జేఏసీ నాయకులు కేవీ రమణ, సాకే హరి తదితరులు వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ బీజేపీ మత రాజకీయాలను ఖండించారు. రిలే నిరాహార దీక్షలకు కార్పొరేటర్లు ఇషాక్, రహంతుల్లా, వైఎస్సార్‌సీపీ మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి అబూజర్ నదీం, దాదు, జావీద్, ఖాజా హుస్సేన్, మునీరా, గ్రీవెన్స్ అధ్యక్షులు బాకే హబీబుల్లా, అడ్వొకేట్ రసూల్, మునిసిపల్ మాజీ చైర్మన్ నూర్‌మహ్మద్, సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్, నాయకులు గోల్డ్‌బాషా, ఐఎంఎం మహబూబ్ బాషా, తాజ్, కాంగ్రెస్ నాయకులు ఇమామ్, ఎమ్మార్పీఎస్ సామ్రాట్, డాక్టర్ చంద్రశేఖర్, మధు సంఘీభావం ప్రకటించారు.
నిరసన దీక్షల్లో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి


