కమ్మూరు వెల్‌నెస్‌ సెంటర్‌కు జాతీయస్థాయి గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

కమ్మూరు వెల్‌నెస్‌ సెంటర్‌కు జాతీయస్థాయి గుర్తింపు

Apr 11 2025 1:11 AM | Updated on Apr 11 2025 1:11 AM

కమ్మూ

కమ్మూరు వెల్‌నెస్‌ సెంటర్‌కు జాతీయస్థాయి గుర్తింపు

కూడేరు: మెరుగైన వైద్య సేవలందించిన కమ్మూరు హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. గత ఏడాది జూలై 16న జాతీయస్థాయి అధికారులు కమ్మూరు హెల్త్‌ సెంటర్‌ను పరిశీలించారు. సెంటర్లో అందుతున్న వైద్య సేవలపై ప్రజలతో ఆరా తీశారు. సేవలు బాగా అందిస్తుండడంతో జాతీయ నాణ్యతా ప్రమాణాల గుర్తింపునకు ఎంపిక చేశారు. గురువారం డీఎంహెచ్‌ఓ భ్రమరాంబదేవి చేతుల మీదుగా హెల్త్‌ సెంటర్‌ సీహెచ్‌ఓ జయ జాతీయస్థాయి సర్టిఫికెట్‌ అందుకున్నారు. సెంటర్‌కు గుర్తింపు తెచ్చినందుకు మండల వైద్యాధికారి సౌమ్యారెడ్డి, సీహెచ్‌ఓ జయ, ఏఎన్‌ఎం మాధవి, ఆశా వర్కర్లు శ్రీదేవి, ఆదెమ్మ, మీనాక్షి, చంద్రకళను అభినందించారు.

భర్తను కడతేర్చిన

భార్యకు జీవిత ఖైదు

అనంతపురం: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను కడతేర్చిన కేసులో భార్యకు జీవితఖైదు విధిస్తూ అనంతపురం 7వ సెషన్స్‌ అడిషనల్‌ జడ్జి కోర్టు తీర్పు వెలువరించింది. అనంతపురంలోని అశోక్‌నగర్‌కు చెందిన రాజేంద్రప్రసాద్‌, యల్లనూరు మండలం శింగవరం గ్రామానికి చెందిన బత్తిని సుమకుమారికి 17 సంవత్సరాల కిందట వివాహమైంది. వీరి కాపురం కొన్ని రోజులు సవ్యంగా జరిగింది. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. భార్య వివాహేతర సంబంధం గురించి తెలిసి భర్త మందలించాడు. ఈ క్రమంలో భర్తను అడ్డు తొలగించేందుకు 2021 నవంబర్‌ రెండో తేదీ రాత్రి 7 గంటల సమయంలో రోకలి బండతో కొట్టింది. దీంతో రాజేంద్రప్రసాద్‌ అక్కడికక్కడే చనిపోయాడు. హతుని అన్న విజయకుమార్‌ ఫిర్యాదు మేరకు అప్పటి వన్‌టౌన్‌ సీఐ డి.ప్రతాప్‌రెడ్డి కేసు నమోదు చేశారు. అనంతపురం అడిషనల్‌ 7వ సెషన్స్‌ జడ్జి కోర్టులో చార్జ్‌షీటు దాఖలు చేశారు. జడ్జి హరిత గురువారం 15 మంది సాక్షులను విచారించారు. నేరం రుజువు కావడంతో సుమకుమారికి జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించారు. పీపీ నాగరాజ బాబు ప్రాసిక్యూషన్‌ తరఫున వాదించారు. అప్పటి వన్‌టౌన్‌ సీఐ ప్రతాప్‌రెడ్డి, కోర్టు మానిటరింగ్‌ సిస్టమ్‌ సీఐ వెంకటేష్‌ నాయక్‌, వన్‌టౌన్‌ సీఐ రాజేంద్రనాథ్‌ యాదవ్‌, కోర్టు లైజన్‌ ఆఫీసర్‌ శ్రీనివాసులు, ఎస్‌ఐ సునీల్‌కుమార్‌లు సాక్షులను సకాలంలో ప్రవేశపెట్టి ముద్దాయికి శిక్షపడేలా తమ వంతు కృషి చేశారు. వీరందరినీ ఎస్పీ అభినందించారు.

పనులు వేగవంతం చేయాలి

అనంతపురం అర్బన్‌: ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన్‌, పీఎంశ్రీ ఫేజ్‌–1 ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. ఇంజినీరింగ్‌ సెక్టార్‌కు సంబంధించిన పనులపై కలెక్టర్‌ గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఎస్‌ఈలు, ఈఈలు, డీఈఈలు, ఇతర అధికారులతో సమీక్షించారు. ప్రధాన మంత్రి సడక్‌ యోజన కింద గ్రామాలకు రహదారులు నిర్మించే పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పూర్తయిన పనుల ప్రారంభోత్సవానికి చర్యలు తీసుకోవాలన్నారు. పీఎంశ్రీ ఫేజ్‌–1 పనులకు సంబంధించి ఆటస్థలాలు, గ్రంథాలయలు, కంప్యూటర్‌ గదులు, కిచెన్‌ గార్డెన్‌, రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌, ఆర్‌ఓ ప్లాంట్లు, మరుగుదొడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పెండింగ్‌ పనులకు సంబంధించి నివేదికలు సిద్ధం చేస్తే త్వరితగతిన నిధుల మంజూరుకు కృషి చేస్తామని చెప్పారు. సమావేశంలో పీఆర్‌ ఎస్‌ఈ జహీర్‌ అస్లాం, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ మురళీధర్‌ శర్మ, ఏపీఎస్‌ఎంఐడీసీ ఈఈ శ్రీనివాసనాయుడు, ఏఎంసీ ఎస్‌ఈ చంద్రశేఖర్‌, పీహెచ్‌ ఈఈ ఆదినారాయణ, ఎస్‌ఎస్‌ఏ ఈఈ శంరయ్య, తదితర శాఖ అధికారులు పాల్గొన్నారు.

కమ్మూరు వెల్‌నెస్‌ సెంటర్‌కు జాతీయస్థాయి గుర్తింపు 1
1/2

కమ్మూరు వెల్‌నెస్‌ సెంటర్‌కు జాతీయస్థాయి గుర్తింపు

కమ్మూరు వెల్‌నెస్‌ సెంటర్‌కు జాతీయస్థాయి గుర్తింపు 2
2/2

కమ్మూరు వెల్‌నెస్‌ సెంటర్‌కు జాతీయస్థాయి గుర్తింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement