కలల సాకారానికి ఈ–సెట్
అనంతపురం: ఉన్నత కలలకు ఏపీ ఈ–సెట్ తొలిమెట్టుగా నిలుస్తోంది. పేరెన్నికగల కళాశాలల్లో బీటెక్, బీఈ పూర్తి చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అదే ఏపీ ఈఏపీసెట్ (ఎంసెట్) ద్వారా గణనీయమైన ర్యాంకు సాధిస్తే ఈ కలను సాకారం చేసుకోవచ్చు. అయితే ఈఏపీసెట్‌కు పోటీ అధికంగా ఉంటుంది. కానీ, మంచి కళాశాలల్లో ఇంజినీరింగ్ సీటు దక్కించుకునేందుకు ఏపీ ఈ–సెట్ మరో చక్కటి మార్గం. ఏపీ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఈ–సెట్)లో సత్తా చాటితే నేరుగా బీటెక్ సెకండియర్‌లో అడ్మిషన్ పొందవచ్చు. డిప్లొమా పూర్తి చేసిన వారు, బీఎస్సీ(మేథమేటిక్స్) పూర్తి చేసినవారు ఇందుకు అర్హులు. ఫార్మసీ కోర్సుల్లో సైతం అడ్మిషన్లు పొందడానికి ఈ–సెట్ దోహదపడుతుంది. యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలల్లోనూ సీట్లు దక్కించుకోవచ్చు. మొత్తం సీట్లలో 10 శాతం ఈ–సెట్ ర్యాంకర్లకు కేటాయిస్తున్నారు. దీంతో ఈ–సెట్ అనేది డిప్లొమా విద్యార్థులకు వరంలా మారింది.
లేటరల్ ఎంట్రీ ద్వారా అవకాశం
ఇంజినీరింగ్ కోర్సులో లేటర్ ఎంట్రీ ద్వారా రెండో సంవత్సరంలోకి అడ్మిషన్ పొందడానికి అవకాశం కల్పిస్తూ నిర్వహిస్తున్న ఏపీ ఈ–సెట్–2025కు భారీగా దరఖాస్తులు అందాయి. ఈ ఏడాది మొత్తం 33,454 మంది దరఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్ ఇంజినీరింగ్ విభాగానికి–143, బీఎస్సీ(మేథమేటిక్స్) –41, సిరామిక్ టెక్నాలజీ–3, కెమికల్ ఇంజినీరింగ్ –290, సివిల్ ఇంజినీరింగ్ –2,874, కంప్యూటర్ సైన్సెస్–10,639, ఈఈఈ–5492, ఈసీఈ–9,024, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ –54, మెకానికల్ ఇంజినీరింగ్ –4,424, మెటలార్జీ –97, మైనింగ్–66, ఫార్మసీ విభాగానికి –307 చొప్పున మొత్తం 33,454 దరఖాస్తులు అందాయి. దరఖాస్తు చేసుకునేందుకు గడువును మరింత పెంచడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఈ నెల 12వ తేదీ వరకు రూ.వెయ్యి అపరాధ రుసంతో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే 17వ తేదీ వరకు రూ.2వేలు, 24వ తేదీ వరకు రూ.4వేలు, 28వ తేదీ వరకు రూ.10 వేల అపరాధ రుసుంతో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికి మే 6వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
జేఎన్‌టీయూకు అవకాశం
ఏపీ ఈ–సెట్‌ను ఇప్పటి వరకూ 8 దఫాలుగా నిర్వహించే అవకాశం జేఎన్‌టీయూ (ఏ)కు దక్కింది. 2015 నుంచి 2020 వరకు ఏపీ ఈసెట్‌ను రాష్ట్ర కన్వీనర్‌గా ప్రొఫెసర్ పీఆర్ భానుమర్తి , 2021లో ప్రొఫెసర్ సి. శశిధర్, 2024లో ప్రొఫెసర్ పీఆర్ భానుమూర్తి విజయవంతంగా నిర్వహించారు. తాజాగా ప్రొఫెసర్ దుర్గాప్రసాద్‌ను ఈసెట్ కన్వీనర్‌గా నియమించారు.
క్రేజీ కంప్యూటర్ సైన్సెస్
ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ సైన్సెస్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో బీటెక్ కంప్యూటర్ సైన్సెస్ కోర్సుల్లో అడ్మిషన్ పొందాలంటే ఏపీఈఏపీ సెట్‌లో గణనీయమైన ర్యాంక్‌ను సాధించాల్సి ఉంటుంది. అదే డిప్లొమో కంప్యూటర్ సైన్సెస్ పూర్తి చేసిన వారు ఈ–సెట్ ద్వారా మంచి కళాశాలల్లో కంప్యూటర్ సైన్సెస్ కోర్సు దక్కించుకోవచ్చు. గతేడాది కంటే ఈ ఏడాది ఈ–సెట్ కంప్యూటర్ సైన్సెస్ బ్రాంచ్‌కు దరఖాస్తులు పెరగడమే ఇందుకు కారణం.
ఇంజినీరింగ్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా సెకండియర్‌లోకి అడ్మిషన్
డిప్లొమా, బీఎస్సీ మ్యాథ్స్ విద్యార్థులకు సువర్ణ అవకాశం
జేఎన్‌టీయూ(ఏ) ఆధ్వర్యంలో ఏపీ ఈసెట్ నిర్వహణ


