ఘనంగా కదిరప్పస్వామి రథోత్సవం
గుంతకల్లు రూరల్: మండలంలోని నాగసముద్రం గ్రామంలో వెలసిన కదిరప్పస్వామి రథోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేడుకలను తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. వేకువజామునే ఆలయంలో శ్రీలక్ష్మీనరసింహ మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కొలువుదీర్చి కల్యాణం జరిపించారు. సాయంత్రం ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్లి రథంపై అధిష్టింపజేసి ప్రత్యేక పూజల అనంతరం గోవింద నామస్మరణతో భక్తులు ముందుకు లాగారు.
జీఓ 77ను రద్దు చేయాలి : పీడీఎస్‌యూ
అనంతపురం ఎడ్యుకేషన్: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి పీజీ విద్యార్థులను దూరం చేసే జీఓ 77ను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) రాష్ట్ర అధ్యక్షుడు కె.భాస్కర్ డిమాండ్ చేశారు. ఆదివారం అనంతపురంలోని జార్జిరెడ్డి కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కె.భాస్కర్‌తో పాటు పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరేంద్ర ప్రసాద్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.3,600 కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయాయన్నారు. ఫీజు బకాయిలు విడుదల చేస్తామన్న విద్యాశాఖ మంత్రి లోకేష్ మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయని మండిపడ్డారు. యువగళం పాదయాత్రలో జీఓ 77 రద్దు చేస్తామంటూ ఇచ్చిన హామీని మంత్రి నారా లోకేష్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడిచినా ఇంతవరకూ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయకుండా పాలకులు కాలయాపన చేస్తున్నారన్నారు. వీసీ నియామకాలపై యూజీసీ నూతన ప్రతిపాదనలను వ్యతిరేకించి, యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాపాడాలన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలని, జీఓలు 107, 108ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తల్లికి వందనం పథకాన్ని తక్షణమే అమలు చేయాలన్నారు. సమావేశంలో పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల ప్రసాద్, కోశాధికారి బండారి శంకర్, నాయకులు తేజ, ఉదయ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమణ పాల్గొన్నారు.
ఏడుగురిపై కేసు నమోదు
తాడిపత్రి టౌన్: ఈ నెల 11న తాడిపత్రి పట్టణ పోలీస్‌స్టేషన్ ఎదుట బంగారం వర్తకుడు గౌసుల్లా ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ సాయిప్రసాద్ ఆదివారం తెలిపారు. నిందితుల్లో తాడిపత్రికి చెందిన జిలాన్, రఫీ, హజీ, రసీద్, గౌస్, ఇంతియాజ్, రబ్బాన్నీ ఉన్నారని పేర్కొన్నారు.
ఘనంగా కదిరప్పస్వామి రథోత్సవం


