అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయం
అనంతపురం: విపత్తుల సమయంలో అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయమని ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్ అన్నారు. సోమవారం నగరంలోని ఆ శాఖ కార్యాలయంలో అగ్ని మాపక వారోత్సవాల ప్రారంభోత్సవంలో జిల్లా జడ్జి పాల్గొన్నారు. వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. 2024లో జరిగిన అగ్ని ప్రమాదాల్లో ఫైర్ ఫైటింగ్ చేస్తూ అమరులైన సిబ్బందికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది ప్లకార్డులు చేతబట్టి నగరంలో ర్యాలీ నిర్వహించి, కరపత్రాలు పంచారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఫైర్ సర్వీస్ సిబ్బంది, అధికారులు, విశ్రాంత అధికారులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఏడీఎఫ్‌ఓ లింగమయ్య, ప్రాంతీయ అగ్నిమాపక అధికారి ఎం. భూపాల్ రెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి వి. శ్రీనివాస రెడ్డి, ఎస్‌ఆర్‌ఐటీ, బాలాజీ విద్యా సంస్థలు, ట్రెల్లీస్ స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
హెచ్‌ఎం పదోన్నతుల
సీనియార్టీ జాబితా సిద్ధం
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జిల్లా పరిషత్, మునిసిపాలిటీ, అనంతపురం కార్పొరేషన్‌లో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించేందుకు సీనియార్టీ జాబితాను తయారు చేశారు. deoanantha puramu.blogspot.com వెబ్‌సైట్‌లో ఉంచినట్లు డీఈఓ ప్రసాద్‌బాబు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జాబితాపై ఏవైనా అభ్యంతరాలుంటే ఆధారాలతో ఈనెల 19లోపు ఫిర్యాదు చేయాలని డీఈఓ సూచించారు.
కష్టపడి చదివితేనే
ఉజ్వల భవిష్యత్తు
అనంతపురం రూరల్: విద్యార్థులు కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కలెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. సోమవారం నగరంలోని సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహం–1, 2లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వసతి గృహాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు.విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో పాల్గొనాలని, దీంతో శారీరక, మానసికోల్లాసం కలుగుతుందన్నారు. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలపై విద్యార్థినులు అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం విద్యార్థినులతో కలసి వసతి గృహంలోనే భోజనం చేశారు. కార్యక్రమంలో జేసీ శివ్‌నారాయణశర్మ, ఆర్డీఓ కేశవనాయుడు, సాంఘిక సంక్షేమశాఖ డీడీ (ఇన్‌చార్జ్) రాధిక తదితరులు పాల్గొన్నారు.
అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయం


