నేమకల్లు వద్ద కొండను కొల్లగొడుతున్న దృశ్యం
మైనింగ్ డాన్ కాంతారావుకు కూటమి సర్కారు దన్ను
2019లో వేసిన రూ.13.19 కోట్ల జరిమానాపై రివిజన్ ఉత్తర్వులు
మాఫీ చేయాలనే తలంపుతోనే ఇలా చేస్తున్నారని విమర్శలు
కూటమి సర్కారు వచ్చాక మళ్లీ ప్రకృతి వనరులపై పడిన ఘనుడు
ప్రకృతిని చెరబట్టాడు. కొండలను కరిగించేశాడు. ప్రజలపై దుమ్ము కొట్టాడు. అందిన కాడికి వెనకేసుకున్నాడు. అతని విశృంఖలత్వాన్ని చూసి అధికారులే విస్తుబోయారు. ఏకంగా రూ. 13 కోట్లకు పైగా ఫైన్ విధించారు. సదరు వ్యక్తి నుంచి ముక్కు పిండి ఆ మొత్తాన్ని వసూలు చేయాల్సి ఉండగా.. కూటమి సర్కారు మాత్రం కరుణ చూపుతోంది. మన వాడే కదా.. అని ఏకంగా జరిమానాను రద్దు చేసేలా పావులు కదుపుతోంది.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లాలో మైనింగ్ మాఫియా డాన్‌గా పేరుగాంచిన టీవీఎస్ కాంతారావుకు కూటమి సర్కారు దన్నుగా నిలుస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన టీవీఎస్ కాంతారావు గతంలో బొమ్మనహాళ్ మండలం నేమకల్లు కేంద్రంగా భారీ దోపిడీ సాగించారు. కొండలను కొల్లగొట్టి రూ. కోట్లు కూడగట్టారు. అక్రమంగా కంకర, గ్రావెల్‌ను ఓబులాపురం మీదుగా కర్ణాటకకు తరలించారు. ఇతనిపై ఫిర్యాదుల నేపథ్యంలో 2019లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే మైనింగ్ అధికారులు నేమకల్లు వద్ద తనిఖీలు నిర్వహించారు. కాంతారావు అక్రమాలు చూసి ఆశ్చర్యపోయారు.పూర్తిస్థాయి విచారణ అనంతరం రూ.13.19 కోట్ల జరిమానా విధించారు. కానీ ఇప్పటికీ పైసా కూడా ప్రభుత్వానికి చెల్లించలేదు.
జరిమానాపై పునఃపరిశీలన..
కూటమి సర్కారు కొలువుదీరిన మూడు నెలలకే అంటే 2024 సెప్టెంబర్ 7న గతంలో కాంతారావుకు విధించిన జరిమానాను మళ్లీ పరిశీలించాలని ప్రభుత్వం జిల్లా గనుల శాఖను ఆదేశించింది. 2019లో గనులశాఖ అధికారులు స్వయంగా వారం రోజులు పరిశీలించి.. భారీగా అక్రమ మైనింగ్ జరిగిందని నిర్ధారించి... ఆ మేరకు నివేదిక ఇచ్చిన తర్వాత వేసిన జరిమానాపై పునఃపరిశీలించాలని ఆదేశాలు జారీ చేయడం చూస్తే... దాన్ని పూర్తిగా మాఫీ చేసే తలంపులో ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. దీనికితోడు అప్పట్లో రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆస్తులు కూడా జప్తు చేయాలని, ఆ స్థాయిలో అక్రమాలు జరిగాయని ఇచ్చిన నివేదికను కాదని ఇప్పుడు మళ్లీ పరిశీలించమన్నారంటే ఏ స్థాయిలో మైనింగ్ డాన్‌కు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోందో ఊహించుకోవచ్చు.
కూటమి సర్కారు రాగానే స్టార్ట్..
కాంతారావుకు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అండగా నిలుస్తున్నారని, ప్రభుత్వ ఉత్తర్వుల వెనుక ఆయన పాత్ర ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2024లో జరిగిన ఎన్నికల్లో టీడీపీకి కాంతారావు నిధులు సమకూర్చారని, అందుకే ‘రివిజన్’ చేస్తున్నారని టీడీపీ నాయకులే విమర్శిస్తున్నారు. బొమ్మనహాళ్ మండలం నేమకల్లు వద్ద కొండలు, గుట్టల్ని పిండి చేసి ఏళ్ల తరబడి రూ.కోట్లు దోచుకున్న కాంతారావు.. మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం రాగానే అనుమతులు లేకున్నా యథేచ్ఛగా ప్రకృతి వనరులను కొల్లగొట్టడం ప్రారంభించడం గమనార్హం. సర్కారు కొలువుదీరిన మరుసటి రోజే నేమకల్లు పరిసరాల్లో జేసీబీలు, క్రషర్లు గద్దల్లా వాలినట్లు తెలిసింది.
క్రషర్ యూనిట్ నుంచి వెలువడుతున్న పొగ


