అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం
● ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందిన వారిలో కలవరం
● ఇప్పటికే రాజీనామా చేసిన ఓ అంగన్‌వాడీ టీచర్
● విచారణకు ముందుగానే రాజీనామా చేద్దామనే యోచనలో మరికొందరు
సర్టిఫికెట్లను పరిశీలిస్తున్న ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు
డైరెక్టరేట్ ఆదేశాల మేరకు ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన టీచర్లు, ఆయాలపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు వారి వద్ద ఉన్న సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ చేపట్టాం. ఎలాంటి వివక్ష చూపకుండా సర్టిఫికెట్లను పరిశీలించాలని సూపర్‌వైజర్లను ఆదేశించాం. ఫేక్‌సర్టిఫికెట్‌తో ఉద్యోగం పొందారని నిర్ధారణ అయితే శాఖాపరమైన చర్యలు తప్పవు. ఈ నెల 22వ తేదీ లోపు సర్టిఫికెట్లు అందజేయాలి. అందజేయని వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫారసు చేయనున్నాం.
– సాజిదాబేగం, సీడీపీఓ, తాడిపత్రి ప్రాజెక్టు
తాడిపత్రి రూరల్: ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారం ఐసీడీఎస్‌ను కుదిపేస్తోంది. ఫేక్ సర్టిఫికెట్లతో అంగన్‌వాడీ టీచర్లుగా, ఆయాలుగా ఉద్యోగాలు పొందిన వారిలో కలవరం మొదలైంది. ఐసీడీఎస్ డైరెక్టరేట్ ఆదేశాల మేరకు తాడిపత్రిలోని ఆ శాఖ కార్యాలయంలో మంగళవారం సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ చేపట్టారు. తాడిపత్రి ప్రాజెక్టు పరిధిలోని తాడిపత్రి టౌన్, తాడిపత్రి మండలం, పెద్దపప్పూరు, యాడికి, పెద్దవడుగూరు మండలాలకు చెందిన దాదాపు 302 అంగన్‌వాడీ సెంటర్లకు చెందిన టీచర్లు, ఆయాలు స్థానిక ఐసీడీఎస్ కార్యాలయానికి చేరుకుని తమ పదవ తరగతి మార్కుల జాబితా, స్టడీ సర్టిఫికెట్లు, ఉద్యోగం పొందిన ఆర్డర్ కాపీలను ఒరిజనల్‌తో పాటు గెజిటెడ్ సంతకంతో కూడిన జిరాక్స్ కాపీలను అందజేసేందుకు తరలిరావడంతో కార్యాలయం మంగళవారం కిక్కిరిసింది. సూపర్‌వైజర్లు తమకు కేటాయించిన క్లస్టర్ పరిధిలోని టీచర్లు, ఆయాలకు సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలనలో నిమగ్నమయ్యారు.
రాష్ట్రాన్ని కుదిపేసిన తాడిపత్రి ఘటన
ఉమ్మడి జిల్లాలోని ఐసీడీఎస్ కార్యాలయాల పరిధిలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు సంబంధించిన ఫేక్ సర్టిఫికెట్ల డొంక కదులుతోంది. తాడిపత్రి ఐసీడీఎస్ ప్రాజెక్టులో ప్రారంభమైన ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా విచారణకు కారణమైంది. ప్రకాశం జిల్లాలోనూ పలువురు అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందినట్లుగా గుర్తించిన అధికారులు అక్కడ సైతం విచారణ చేపట్టారు. దీంతో తాడిపత్రి ప్రాజెక్ట్‌లో కొందరు కోర్టును ఆశ్రయించిన తరహాలోనే అక్కడి అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు హైకోర్టు మెట్లు ఎక్కారు. ఇది కాస్త ఐసీడీఎస్ డైరెక్టరేట్‌కు తలనొప్పి మారడంతో ఈ వివాదానికి పుల్‌స్టాప్ పెట్టేలా ఫేక్ సర్టిఫికెట్లను సమర్పించి ఉద్యోగం పొందిన టీచర్లు, ఆయాలను తొలగించేందుకు సిద్ధమైంది. ఈ విచారణ బాధ్యతను విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు అప్పగించడంతో సర్టిఫికెట్ల పరిశీలన వేగవంతమైంది.
స్పష్టమైన ఆదేశాలు జారీ
అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూపర్‌వైజర్లకు స్పష్టమైన అదేశాలు అందాయి. గతంలో వెలుగు చూసిన ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారంపై అప్పట్లో జిల్లా ఐసీడీఎస్ అధికారులు చేపట్టిన పరిశీలన ప్రక్రియ కాస్త యూనియన్ నాయకుల ఒత్తిళ్ల కారణంగా నీరుగారిపోయింది. పలు కారణాలు చూపుతూ అప్పట్లో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారు శాఖపరమైన చర్యల నుంచి తప్పించుకున్నారు. తాజాగా ఈ వివాదం రాష్ట్రస్థాయి సమస్యగా మారడంతో స్వయంగా డైరెక్టరేట్ జోక్యం చేసుకుని పునర్‌విచారణకు ఆదేశించడంతో అక్రమార్కుల గుండెల్లో దడ మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ అక్రమార్కులకు అండగా నిలిచిన వారు సైతం చేతులెత్తేశారు.
రాజీనామా బాటలో..
వ్యక్తిగత కారణాల పేరుతో ఇప్పటికే అంగన్‌వాడీ టీచర్ ఒకరు రాజీనామా చేశారు. అయితే ఫేక్ సర్టిఫికెట్ల కారణంగా శాఖాపరమైన చర్యలు తీసుకుంటే ఉన్న పరువు కాస్త పోతుందన్న ఆలోచనతో ఆమె రాజీనామా చేసినట్లుగా వదంతులు వ్యాపించాయి. ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన మరికొందరు కూడా ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకు యూనియన్ నాయకులతో మంతనాలు జరుపుతుండగా, మరికొందరు పరువు పోకుండా ముందస్తుగానే రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి వారు తొలిరోజు సర్టిఫికెట్ల పరిశీలనకు దూరంగా ఉన్నట్లు సమాచారం.
అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం
అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం


