క్రేజీ గేమ్ క్రికెట్. పొట్టి ఫార్మాట్, వన్డే, టెస్టు
● రోజూ రూ.150 కోట్ల వ్యాపారం
● తాడిపత్రి కేంద్రంగా భారీగా బెట్టింగ్
● ఆర్థికంగా చితికి... చైన్‌స్నాచర్లుగా మారుతున్న యువత
● ఇంటర్మీడియెట్ విద్యార్థులూ బెట్టింగ్ మీద ఆసక్తి
● ఐపీఎల్ మ్యాచ్‌లతో ఆర్థికంగా పతనావస్థకు
సాక్షి ప్రతినిధి, అనంతపురం : క్రికెట్.. ప్రేక్షకులను రంజింపచేయడమేమో కానీ బెట్టింగ్ రూపంలో పలువురి జీవితాలను కబళిస్తోంది. కుటుంబాలకు కుటుంబాలే దుఃఖసాగరంలో మునిగిపోతున్న దుస్థితి. ఎక్కడో జరుగుతున్న ఆటపై ఇక్కడ పందెం కాస్తూ క్రికెట్‌ను అతిపెద్ద జూద స్థావరంగా మార్చుకున్న యువతకు ఇదొక శాపంగా పరిణమించింది. పండ్ల తోటలు, మెట్ట పైర్లకు వేదికగా, కరువు ప్రాంతంగా ముద్రపడిన ఉమ్మడి అనంతపురం జిల్లా ఇప్పుడు అతిపెద్ద బెట్టింగ్ కేంద్రంగా మారి వందలాది కుటుంబాలను చిదిమేస్తోంది. ఐపీఎల్ మ్యాచ్‌లు ఒక్కరోజులోనే ఎంతోమంది యువకుల జీవితాలను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి.
ఒక్కో మ్యాచ్‌కు రూ.150 కోట్ల బెట్టింగ్
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక్కో ఐపీఎల్ మ్యాచ్‌కు రూ.150 కోట్లకుపైగా బెట్టింగ్ జరుగుతున్నట్టు అంచనా. బెట్టింగ్‌లో ఎక్కువగా 30 ఏళ్లలోపు యువత పాల్గొంటున్నట్టు పోలీసులు చెబుతున్నారు. మ్యాచ్ మొత్తానికి ఒక పందెం, ఓవర్ టు ఓవర్ ఇలా రకరకాలుగా పందెం కాస్తున్నారు. నాలుగు రోజుల కిందట పంజాబ్ కింగ్స్ లెవెన్, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ జరిగింది. ఇందులో పంజాబ్ కింగ్స్ లెవెన్ 111 పరుగులు మాత్రమే చేసింది. కోల్‌కతా గెలుస్తుందని వెయ్యికి లక్ష రూపాయలు పందెం జరిగింది. పంజాబ్ ఓడిపోతుందని బెట్టింగ్ కాసిన వాళ్లు బికారులైపోయారు.
ఆర్థికంగా చితికి దొంగలుగా మారి..
నాలుగు రోజుల క్రితం ఆరుగురు చైన్‌స్నాచర్లను అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. వీరి పూర్వాపరాలు ఆరా తీస్తే.. అందరూ క్రికెట్ బెట్టింగ్ ఆడి ఆర్థికంగా అప్పులపాలైన వారే. అప్పుల నుంచి గట్టెక్కేందుకు చైన్‌స్నాచర్లుగా మారారు. ఎక్కడ ఒంటరి మహిళలు కనిపించినా బంగారు గొలుసులు లాక్కెళ్లడం, వచ్చిన డబ్బుతో జల్సా చేయడం.. ఇదీ పరిస్థితి. వీళ్లే కాదు ధర్మవరం, కదిరి, హిందూపురం, అనంతపురం, ఉరవకొండ ఇలా పలు ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగుల్లో నష్టపోయిన వారు దొంగలుగా మారారు. కొంతమంది అప్పుల వారి నుంచి ఒత్తిడి భరించలేక బలవన్మరణానికి పాల్పడి తల్లిదండ్రులకు గర్భశోకం మిగుల్చుతున్నారు.
తాడిపత్రి కేంద్రంగా బుకీలు
గంజాయి, మట్కాకే కాదు ఇప్పుడు బుకీలకూ తాడిపత్రి కేంద్ర బిందువైంది. గొలుసు దొంగలు (చైన్‌స్నాచర్లు) దొరికిన రెండు రోజులకే తాడిపత్రిలో క్రికెట్ బుకీలు పోలీసులకు చిక్కారు. దొరికింది ఏడుగురే అయినా ఇంకా చాలామంది ఉన్నట్టు పోలీసుల అంచనా. అమాయక యువకులకు ఆశ చూపి బెట్టింగ్ ఉచ్చులోకి దించుతున్నారు. సర్వస్వం కోల్పోయాక కానీ కుర్రాళ్లు తెలుసుకోలేరు. ఇంటర్మీడియెట్ కుర్రాళ్లు సైతం బెట్టింగ్ ఉచ్చులో ఇరుక్కుని విలవిలలాడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ఒక విషవలయంలా మారింది.
జీవితాలు ఫణంగా పెట్టొద్దు
పంపాచారి, షాకీర్, నాగార్జున, ఫజిల్ అహ్మద్ ఈ నలుగురూ పేకాట, క్రికెట్ బెట్టింగ్‌లలో నష్టపోయి దొంగలుగా మారారు. ఈజీ మనీకోసం ఇలా బెట్టింగ్.. ఆ తర్వాత దొంగతనాలు చేయడం జరుగుతోంది. యువత కెరీర్ చూడాలి కానీ బెట్టింగ్ వైపు కాదు. క్రికెట్ బెట్టింగ్ ప్రమాదకరం. ఆటను ఆటవరకే ఆస్వాదించాలి కానీ బెట్టింగ్‌వైపు చూడకూడదు. తల్లిదండ్రులు కూడా పిల్లల ఆర్థిక స్థితిగతులపై ఒక నిఘా వేసి ఉంచాలి. పేకాట, బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్‌వైపు వెళ్లి జీవితాలు ఫణంగా పెట్టకండి.
–పి.జగదీష్, ఎస్పీ, అనంతపురం
క్రేజీ గేమ్ క్రికెట్. పొట్టి ఫార్మాట్, వన్డే, టెస్టు


