ఇంగ్లిష్‌ సార్లు లేరిక్కడ! | - | Sakshi
Sakshi News home page

ఇంగ్లిష్‌ సార్లు లేరిక్కడ!

Apr 19 2025 5:05 AM | Updated on Apr 19 2025 5:05 AM

ఇంగ్లిష్‌ సార్లు లేరిక్కడ!

ఇంగ్లిష్‌ సార్లు లేరిక్కడ!

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఉమ్మడి జిల్లాలోని పలు ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లిష్‌ పాఠ్యాంశాలు బోధించే టీచర్లు లేరు. ఫలితంగా పదో తరగతి విద్యార్థులు ఇప్పటికే తీవ్రంగా నష్టపోయారు. 2023 జూన్‌లో అన్ని సబ్జెక్టులకు పదోన్నతులు కల్పించినా... హై కోర్టులో వివాదం కారణంగా ఇంగ్లిష్‌ టీచర్ల పదోన్నతులకు బ్రేక్‌ పడింది. ఇంగ్లిష్‌ పదోన్నతులు తమకు మాత్రమే కల్పించాలంటూ డిగ్రీలో ఇంగ్లిష్‌ ప్రధాన అంశంగా ఉన్న ముగ్గురు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పదోన్నతులు జరగకుండా హైకోర్టు స్టే విధించింది. అప్పట్లో 230 ఎస్జీటీలకు ఇంగ్లిష్‌ స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు దక్కాల్సి ఉండగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 280కు చేరింది. వాస్తవానికి 2023, జనవరిలో సీనియార్టీ జాబితా తయారు చేసి తాత్కాలిక పదోన్నతులు కల్పించారు. జూన్‌లో రెగ్యులర్‌ పదోన్నతులు ఇచ్చే సమయంలో కోర్డు కేసు కారణంగా ఈ ప్రక్రియ కాస్త ఆగిపోయింది.

నష్టపోతున్నది విద్యార్థులే

ఉమ్మడి జిల్లాలోని టి.వీరాపురం, నేత్రపల్లి, 74–ఉడేగోళం, డి.కొండాపురం, భూపసముద్రం, గుమ్మఘట్ట, గోనబావి, గొల్లపల్లి, కలుగోడు, తాళ్లకెర, రంగచేడు, భూపసముద్రం, పూలకుంట, గొల్లపల్లి, మురడి, మండ్లి, అపిలేపల్లి, బసాపురం, బెస్తరపల్లి, యర్రగుంట, మలయనూరు, తెంగల్లు, లక్ష్మంపల్లి, కనకూరు, వలస, ఆగ్రహారం, కె.శివరం, హేమావతి, బుచ్చయ్యగారిపల్లి, బాచేహల్లి, శెట్టూరు, తిప్పనపల్లి గ్రామాల్లోని జిల్లాపరిషత్‌ యాజమాన్యంలోని ఉన్నత పాఠశాలలతో పాటు కేపీ దొడ్డి, తూముకుంట, మహనంతపురం, కరిగానపల్లి తదితర గ్రామాల్లోని మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌ టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. కుందుర్పి మండలంలోని ఆరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలుండగా ఏ ఒక్క స్కూల్‌లోనూ ఇంగ్లిష్‌ టీచరు లేరు. అక్కడక్కడా కొన్ని పాఠశాలల్లో ఇతర పాఠ్యాంశాల టీచర్లతో ఇంగ్లిష్‌ బోధించేలా సర్దుబాటు చేసి విద్యాశాఖ అధికారులు మిన్నకుండిపోయారు. ఇంగ్లిష్‌ టీచర్ల కొరత కాస్త విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఆటంకంగా మారింది.

వీడని చిక్కుముడి..

ఇంగ్లిష్‌ టీచర్ల పదోన్నతుల వివాదంపై ఈ ఏడాది ఫిబ్రవరి 5న హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పదోన్నతులపై దాఖలైన కేసులన్నీ డిస్పోజ్‌ చేస్తూ ఈ అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పదోన్నతులు కల్పించాలని తుది తీర్పునిచ్చింది. ఈ తీర్పు వెలువడి ఇప్పటికీ రెండు నెలలు దాటినా చిక్కుముడి వీడలేదు. మరోవైపు అర్హులైన ఎస్జీటీలకు అన్యాయం జరిగింది. మిగిలిన సబ్జెక్టులతో పోల్చుకుంటే ఇంగ్లిష్‌ పదోన్నతులు పొందే వారు రెండేళ్ల సీనియార్టీని కోల్పోయారు. వీరిలో కొందరు ఉద్యోగ విరమణ పొందారు. అయినా విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికీ మేల్కొనలేదు.

ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లిష్‌

పాఠ్యాంశాల బోధనకు తీవ్ర ఆటంకం

తీవ్రంగా నష్టపోతున్న విద్యార్థులు

ఉమ్మడి జిల్లాలో ఆగిన పదోన్నతులు

హైకోర్టు ఉత్తర్వులిచ్చినా పదోన్నతుల్లో వీడని చిక్కుముడి

రాష్ట్రంలో ఒక్క ఉమ్మడి ‘అనంత’

జిల్లాలోనే ఈ దుస్థితి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement