
‘అనంత ఆణిముత్యాలు’ పునఃప్రారంభం
● కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
రాప్తాడు: పేద విద్యార్థుల కోచింగ్‌లకు, కార్పొరేటు స్కూళ్లు, కళాశాలల్లో విద్యనభ్య సించేలా చేయూతనందించేందుకు ‘అనంత ఆణిముత్యాలు’ కార్యక్రమాన్ని పునఃప్రారంభించినట్లు కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. సోమవారం రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి పంచాయతీ చిన్మయనగర్‌లో ఆర్‌జేసీ కల్యాణ మండపంలో ‘అనంత ఆణిముత్యాలు ఎడ్యుకేషన్ సొసైటీ’కి రూ.1,34,116 మెగా చెక్కును కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2009లో సొసైటీ ఏర్పాటు చేశారన్నారు. ఇప్పటికే ఏడుగురు విద్యార్థులు లబ్ధి పొందారన్నారు. అప్పట్లో అందిన విరాళాలతో సొసైటీ కార్యకలాపాలు బాగా నడిచాయని, తర్వాత కొన్నాళ్లకే ఆగిపోయా యన్నారు. పేద విద్యార్థులకు సాయమందించాలనే ఉద్దేశంతో పునఃప్రారంభించామన్నారు. తన వంతు సహాయంగా రూ.10 వేలు అందించినట్లు తెలిపారు. ఉద్యోగులు, ప్రజలు కూడా చేయూతనందించాలన్నారు. అనంతపురం జిల్లా కలెక్టర్, అకౌంట్ నంబర్–1429 1001 1001 235, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ యూబీఐఎన్ 0814296కు విరాళాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో జేసీ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్‌ఓ మలోల తదితరులు పాల్గొన్నారు.