
మోదీ, చంద్రబాబు కార్మిక వ్యతిరేకులు
● సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగరావు ధ్వజం
అనంతపురం అర్బన్: ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కార్మిక వ్యతిరేకులని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగరావు ధ్వజమెత్తారు. సీఐటీయూ జిల్లా మహాసభలు శనివారం నగరంలో ప్రారంభమయ్యాయి. ముందుగా ఆర్ట్స్ కళాశాల మైదానం నుంచి నగర పాలక సంస్థ వరకు ర్యాలీ నిర్వహించారు. సీతారాం ఏచూరి ప్రాంగణం (స్థానిక ఫంక్షన్ హాలు)లో సీఐటీయూ జెండాను సీనియర్ నాయకుడు ఏజీ రాజమోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. సీఐటీయూ ఆఫీసు బేరర్లు నాగమణి, నాగరాజు, శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ప్రతినిధుల సభకు నరసింగరావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం చంద్రబాబు దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా నిలిచారన్నారు. పీ–4తో పేదరికం లేకుండా చేస్తానంటూ మరింత పేదరికంలోకి నెట్టేసే విధానాలు అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు. కార్మికుల హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హరిస్తున్నాయన్నారు. పెట్టుబడిదారీ విధానాలు అమలు చేస్తూ శ్రమదోపిడీకి సిద్ధమయ్యాయని మండిపడ్డారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని దుమ్మెత్తిపోశారు. రాష్ట్రంలో 10 గంటల పని విధానంపై అసెంబ్లీలో తీర్మానం చేసి కూటమి ప్రభుత్వం కార్మిక ద్రోహిగా మారిందని మండిపడ్డారు. బ్రిటిష్ పాలకులు కూడా నిత్యావసర సరుకులపై సుంకాలు వేయలేదని, కానీ మోదీ ప్రభుత్వం నిత్యావసరాలపైనా పన్నులు విధించిందని విమర్శించారు.8 గంటల పని విధానం, కార్మికులకు కనీస వేతనాలు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణతో పాటు ఉచిత విద్య, వైద్యం అమలు, హక్కుల పరిరక్షణకు ఉద్యమాలకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబుళు, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఓ.నల్లప్ప, నాయకులు బాలరంగయ్య, లింగమయ్య, ఆర్‌వీనాయుడు, గోపాల్, ముత్తూజా, వెంకటనారాయణ, రామాంజినేయులు, రమాదేవి, శకుంతల, నాగభూషణ, జగన్‌మోహన్, శివప్రసాద్, నాగరాజు, శ్రీనివాసులు, సాకేనాగరాజు పాల్గొన్నారు.