
‘పీపీపీ’తో పేదలకు వైద్యవిద్య దూరం
అనంతపురం అర్బన్: పేదలకు వైద్య విద్యను కూటమి ప్రభుత్వం దూరం చేస్తోందని న్యాయవాదులు మండిపడ్డారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను పబ్లిక్ ప్రైవేట్ పద్ధతి (పీపీపీ)లో నిర్వహించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ ఆనంద్‌ను శనివారం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో న్యాయవాదులు కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం న్యాయవాదులు గాజుల ఉమాపతి, ఆర్. హరినాథరెడ్డి, ఈ.వెంకటరాముడు, గౌనినాగన్న, బాకే హబీబుల్లా తదితరులు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 17 వైద్య కళాశాలలను మంజూరు తీసుకొచ్చా రన్నారు. కళాశాలలకు ప్రభుత్వ భూమి, నిధులు కేటాయించి నిర్మాణాలు చేపట్టారన్నారు. అందులో ఐదు కళాశాలలు ప్రారంభమయ్యాయని, మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. వీటితో పాటు ప్రతి జిల్లాకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణమూ జరుగుతోందన్నారు. వీటి ద్వారా ఏటా 1,500 మంది విద్యార్థులకు వైద్య విద్య అభ్యసించే అవకాశం లభిస్తుందన్నారు. 75 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులు అతి తక్కువ ఖర్చుతో వైద్య విద్య అభ్యసించవచ్చన్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరునికీ మెరుగైన విద్య, వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. కూటమి ప్రభుత్వం ఆ బాధ్యత నుంచి తప్పించుకుంటూ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేస్తోందన్నారు. సర్కారు నిర్ణయంతో వైద్య కళాశాలలతో పాటు సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోకి వెళతాయని, దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు జి.నాగరాజబాబు, టీఆర్ నారపరెడ్డి, టి.నరసింహారెడ్డి, కె.విద్యాపతి, సయ్యద్ షాహి, ఇ.లక్ష్మీకాంత, టీఎం రాఘవేంద్ర, సూర్యచంద్రయాదవ్, తదితరులు పాల్గొన్నారు.