
ఎస్‌బీఐ విశ్రాంత మేనేజర్ ఇంట్లో చోరీ
గుంతకల్లు టౌన్: స్థానిక తిలక్‌నగర్‌లో నివాసముంటున్న ఎస్‌బీఐ విశ్రాంత మేనేజర్ అరికేరి శ్రీనాథ్ ఇంట్లో చోరీ జరిగింది. గుత్తి మాజీ ఎమ్మెల్యే అరికేరి జగదీష్ సోదరుడు అరికేరి శ్రీనాథ్ తన కుటుంబ సభ్యులతో కలసి ఈ నెల 19న బెంగుళూరుకు, తర్వాత అక్కడి నుంచి కాశీ యాత్రకు వెళ్లారు. తాళం వేసిన ఇంటిని గుర్తించిన దుండగులు ఆదివారం వేకువజామున బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించారు. ఆ సమయంలో ఇంట్లోని శబ్ధాలు కావడంతో నిద్ర మేల్కోన్న ఎదురింటిలోని వ్యక్తిగా గట్టిగా కేకలు వేయడంతో దుండగులు పారిపోయారు. విషయాన్ని పోలీసుల ద్వారా శ్రీనాథ్‌కు స్థానికులు చేరవేయడంతో అప్పటికే కాశీ యాత్ర ముగించుకుని బెంగళూరుకు చేరుకున్న శ్రీనాథ్ కుటుంబసభ్యులు వెంటనే ఇంటికి చేరుకుని పరిశీలించారు. బీరువాను ధ్వంసం చేసి బంగారు ఆభరణాలను అపహరించినట్గుగా నిర్ధారించుకున్నారు. కాగా, చోరీ సమయంలో ఓ దుండగుడి టవాల్ అక్కడే పడిపోయింది. వేలిముద్రల నిపుణులు రంగంలో దిగి ఆధారాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ మస్తాన్ తెలిపారు.
ప్రొఫెషనల్ దొంగల పనే..
బ్యాంక్ విశ్రాంత మేనేజర్, బెస్తకాలనీలో వంట మాస్టర్ ఇంట్లో చోరీకి పాల్పడింది ప్రొఫెషనల్ దొంగలేనని పోలీసులు అనుమానిస్తున్నారు. తొలుత బెస్త కాలనీలో దొంగతనానికి పాల్పడిన వారు వచ్చిన హొండా షైన్ ద్విచక్రవాహనాన్ని సంజీవనగర్‌లోని ఓ ఇంటి వద్ద వదిలి కేపీఎస్ థియేటర్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్న లోకేష్ ద్విచక్రవాహనాన్ని అపహరించి తిలక్‌నగర్‌లోని బ్యాంక్ మేనేజర్ ఇంటి వద్ద వదిలి వెళ్లారు. రెండు ద్విచక్రవాహనాలు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.
వంట మాస్టర్ ఇంట్లో ..
స్థానిక బెస్త కాలనీలో నివాసముంటున్న రూప్‌సాగర్ ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు శుభకార్యాల్లో వంట పనిచేస్తూ జీవనం సాగిస్తున్న రూప్‌సాగర్ ఈ నెల 20న ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో కలసి కర్ణాటకలోని హొళ్లి, హోసపేట ప్రాంతాల్లో జరిగిన వివాహ వేడుకల్లో వంట చేయడానికి వెళ్లాడు. గుర్తించిన దుండగులు తాళాలు బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించారు. బీరువాలోని 4 తులాల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదును అపహరించారు. ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించిన స్థానికుల నుంచి సమాచారం అందుకున్న రూప్‌సాగర్ కుటుంబసభ్యులు ఆదివారం ఉదయం ఇంటికి చేరుకుని చోరీ జరిగినట్లుగా నిర్ధారించుకుని సమాచారం ఇవ్వడంతో కసాపురం పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.