
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
● వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్
అనంతపురం రూరల్: ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణను బాధ్యత తీసుకుని మొక్కల పెంపకాన్ని విస్తృతంగా చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు. ‘నమో వనం – ఏక్‌పెడ్ మాకే నామ్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం సీఆర్‌ఐటీ కళాశాలలో ఆయన మొక్కలు నాటి, మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సందిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్, నాయకులు చిరంజీవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పోలీసుల అదుపులో
ద్విచక్ర వాహనాల దొంగ
గుత్తి: ద్విచక్ర వాహనాలను అపహరించుకెళుతున్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, గత ఆరు మాసాలుగా గుత్తి మున్సిపాలిటీ పరిధిలో పలు ద్విచక్ర వాహనాలు అపహరణకు గురయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి అనుమానాస్పదంగా తచ్చాడుతున్న గాజులపల్లికి చెందిన ఓ యువకుడిని సీఐ నాగరాజు, ఎస్‌ఐలు సురేష్, గౌతం అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేపట్టారు. ఒకట్రెండు రోజుల్లో నిందితుడిని అరెస్ట్ చూపనున్నట్లు సమాచారం.
ముందస్తు టీకానే శరణ్యం
● పశుశాఖ జేడీ ప్రేమ్‌చంద్
అనంతపురం అగ్రికల్చర్: రేబీస్ సోకితే చికిత్సకు నయమయ్యే అవకాశం తక్కువగా ఉన్నందున ముందస్తు టీకాలు, ఇతర జాగ్రత్తలే శరణ్యమని పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ జి.ప్రేమ్‌చంద్ అన్నారు. ప్రపంచ రేబీస్ దినోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక సాయినగర్‌లో ఉన్న పశువ్యాధి నిర్ధారణ కేంద్రం, వెటర్నరీ ఆస్పత్రలో నిర్వహించిన కార్యక్రమంలో కుక్కలకు రేబీస్ టీకాలు వేసి, జేడీ మాట్లాడారు. కుక్క కాటు వేస్తే వైరస్ శరీరంలో ప్రవేశించి కండరాలలో వైరస్ వృద్ధి చెంది నాడీ వ్యవస్థ ద్వారా ఇతర భాగాలకు చేరి ప్రాణాంతకంగా మారుతుందని తెలిపారు. చికిత్స కన్నా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్రమం తప్పకుండా పెంపుడు, వీధి కుక్కలకు ముందస్తుగా టీకాలు వేయించాలని తెలిపారు. కుక్క కాటుకు గురైతే పారే నీటి కొళాయి కింద కార్బలిక్ సబ్బు లేదా డెట్టాల్ సబ్బుతో 10 నుంచి 15 సార్లు బాగా నురగ వచ్చేలా కడుక్కోవాలన్నారు. గాయం మీద ఐస్ ముక్కలు ఉంచడం వల్ల కొంత మేలు జరుగుతుందని, అనంతరం వైద్యుల పర్యవేక్షణలో చిక్సి పొందాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీడీఎల్ ఏడీ డాక్టర్ జి.రవిబాబు, ఆసుపత్రి ఏడీ డాక్టర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత