
కొలిస్తే చింతలన్నీ దూరం
తాడిపత్రి రూరల్: కోరిన కోర్చెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న తాడిపత్రిలోని భూదేవి, శ్రీదేవి సమేత చింతల వేంకటరమణస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 30న ప్రారంభం కానున్నాయి. ఏటా ఆశ్వయుజ మాసం శుద్ధ అష్టమి నుంచి బహుళ విదియ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించే పనులు ఊపందుకున్నాయి.
30న మంగళవారం సాయంత్రం విష్యక్సేనారాధన, మృత్సంగ్రహణం, అంకురార్పణ, అక్టోబరు 1న శేషవాహనం, 2న సింహవాహనం, మధ్యాహ్నం శమీ వృక్ష దర్శనం రాత్రి హంసవాహనం, 3న ఉదయం సూర్యప్రభ వాహనం, సాయంత్రం చంద్రప్రభ వాహనం, 4న ఉదయం మోహినిదేవి అలంకరణ, రాత్రి గరుడ వాహనం, 5న ఉదయం తిరుచ్చిలో ఉత్సవం, సాయంత్రం హనుమద్ వాహనం, 6న ఉదయం సర్వభూపాల వాహనం, సాయంత్రం గజవాహనం, 7న ఉదయం తిరుకల్యాణం, మధ్యాహ్నం విందుభోజనాలు, మధ్యాహ్నం 2.45గంటలకు బ్రహ్మరథోత్సవం, 8న ఉదయం తిరుచ్చిలో ఉత్సవం, సాయంత్రం అశ్వవాహనం, 9న వసంతోత్సవం, చక్రస్నానం, సాయంత్రం ద్వాదశ అరాధన, రాత్రి ధ్వజా అవరోహణ, కుంభప్రోక్షణ, భట్టర్ మర్యాద నిర్వహించనున్నారు.
శిల్పకళతో అబ్బుర పరుస్తున్న ఆలయం..
భూదేవి, శ్రీదేవి సమేత చింతల వేంకటరమణస్వామి ఆలయంలో అరుదైన శిల్ప కళాసంపదను సొంతం చేసుకుంది. క్రీ.శ. 1490–1520 మధ్య కాలంలో విజయనగర సామ్రాజ్యంలో మండలాధీశునిగా పనిచేస్తున్న తిమ్మనాయుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. శిల్ప కళాశోభితమైన మంటపాలు, మహాద్వార గోపురాలను అద్భుతంగా నిర్మించారు. ప్రధాన ద్వారం, గాలిగోపురం తూర్పు దశలో ఉన్నాయి. గాలిగోపురానికి ముందు రాతితో నిర్మించిన ఊయాల మంటపం, ఎతైన దీపపు స్తంభం ఉన్నాయి. హంపీలోని శిల్ప కళకు దగ్గర పోలికతో ఉన్న ఈ ఆలయాన్ని వారణాశి నుంచి ప్రత్యేకంగా రప్పించిన శిల్పులతో నిర్మించినట్లుగా చరిత్రకారులు చెతున్నారు. ఆలయంలో ఏకశిలారథంతో పాటు రామాణ, మహాభారత, భాగవతం విశిష్టను చాటే శిల్పాలు అబ్బుర పరుస్తున్నాయి. కళ్యాణమంలపంలోని లో స్థంభంలో మూడు దీపపు స్తంభాలను మీటితే సప్తస్వరాలు పలుకుతాయి. గర్భగుడిపై భాగంలో ఏర్పాటు చేసిన రాతిపద్మం నాటి శిల్ప కళానైపుణ్యానికి అద్దం పడుతోంది. మొత్తం 40 రాతి స్తంభాలతో మహా మంటపాన్ని ఏర్పాటు చేశారు. ఆలయంలోని విశాల ప్రాంగణంలో మహాలక్ష్మి అలయం, కల్యాణమంటపం, చెన్నకేశవ స్వామి ఆలయం, లక్ష్మీ సమేత వరాహస్వామి, ఆంజినేయ స్వామి, లక్ష్మీనారాయణ, రామాంజినేయ, రామానుజార్యుల ఉప అలయాలు ఉన్నాయి.
భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న చింతల వేంకటరమణస్వామి
రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు
7న బ్రహ్మరథోత్సవం
బ్రహ్మోత్సవాలు ఇలా..

కొలిస్తే చింతలన్నీ దూరం