నాగార్జున సాగర్ నుంచి దిగువకు 1.20 లక్షల క్యూసెక్కుల విడుదల
సాక్షి, అమరావతి/విజయపురి సౌత్/శ్రీశైలం ప్రాజెక్ట్: పులిచింతల ప్రాజెక్టుదిశగా కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. నాగార్జున సాగర్‌లో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒక్కో గేటు ఎత్తుతూ రాత్రి 9.30 సమయంలో మొత్తం 20 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 1,20,064 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రధాన కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 28,907 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.
మొత్తం 1,48,971 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. సాగర్ నుంచి దిగువకు విడుదల చేసే నీటి పరిమాణం గంట గంటకూ పెంచుతుండటంతో పులిచింతలలోకి చేరుతున్న వరద క్రమేణా పెరుగుతోంది. పులిచింతల ప్రాజెక్టులోకి సోమవారం సాయంత్రం 6 గంటలకు 30,388 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టా అవసరాల కోసం 4 గేట్లు ఎత్తి 26,083 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీకి తరలిస్తున్నారు. ప్రస్తుతం పులిచింతలలో 6.72 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు.
ఎగువ నుంచి భారీ వరద వస్తున్న నేపథ్యంలో మరో రెండ్రోజుల్లో పులిచింతల ప్రాజెక్టు కూడా నిండనుంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,44,218 క్యూసెక్కులు చేరుతుండగా.. 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి 3,10,840 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఎడమ విద్యుత్ కేంద్రం నుంచి 26,481, కుడి విద్యుత్ కేంద్రం నుంచి 37,857 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఎగువన కర్ణాటకలో ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లలోకి వరద ప్రవాహం కొంతమేర తగ్గింది.
ఆ డ్యామ్‌లలో ఖాళీ ప్రదేశాలను నింపుతూ దిగువకు 1,89,700 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. మహారాష్ట్రలో భీమాపై నిర్మించిన ఉజ్జయిని ప్రాజెక్టు నిండిపోవడంతో గేట్లు ఎత్తి దిగువకు 1,27,705 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక తుంగభద్రలో వరద ప్రవాహం కొంత తగ్గింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 82 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. ఖాళీ ప్రదేశాన్ని నింపుతూ దిగువకు 50 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టులోకి మంగళవారం కూడా ఇదే రీతిలో వరద కొనసాగనుంది.
నిలకడగా గోదావరి
పోలవరం రూరల్: గోదావరి వరద నిలకడగా ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీరు క్రమేపీ తగ్గుతుండటంతో పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 31.320 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్‌వే నుంచి 7.26 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతోంది. భద్రాచలం వద్ద 35.80 అడుగులకు నీటిమట్టం చేరుకుంది.
టెయిల్ పాండ్ నుంచి 1,32,411 క్యూసెక్కులు
సత్రశాల (రెంటచింతల): పల్నాడు జిల్లా రెంటచింతల మండలం సత్రశాల వద్ద కృష్ణా నదిపై నిర్మితమైన నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రెండు యూనిట్లు, ఆరు క్రస్ట్‌గేట్లు ద్వారా మొత్తం 1,32,411 క్యూసెక్కులను పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేస్తున్నట్టు ప్రాజెక్టు ఏడీ ఎన్.జయశంకర్, ఏఈ జయపాల్ సోమవారం తెలిపారు. ఎగువనున్న నాగార్జున సాగర్ నుంచి టైల్‌పాండ్ ప్రాజెక్టు రిజర్వాయర్‌కు 1,32,794 క్యూసెక్కులు వరదనీరు వస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment