![100 MBBS seats per 10 lakh population - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/16/dctr.jpg.webp?itok=zSwT4mu0)
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా 10 లక్షల జనాభాకు 100 ఎంబీబీఎస్ సీట్ల ప్రాతిపదికన కొత్త వైద్యకళాశాలల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చే నిబంధనను 2025–26 విద్యాసంవత్సరం నుంచి అమలుచేస్తామని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) వెల్లడించింది. ఈ మేరకు ఎన్‌ఎంసీ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ్ వి.వానికర్ బుధవారం ప్రకటించారు. దీంతో వచ్చే ఏడాది మన రాష్ట్రానికి రావాల్సిన ఐదు వైద్యకళాశాలలకు అనుమతికి మార్గం సుగమమైంది.
10 లక్షల జనాభాకు 100 ఎంబీబీఎస్ సీట్ల ప్రాతిపదికన కొత్త వైద్యకళాశాలల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చే నిబంధనను 2024–25 విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి తెస్తున్నట్టు ఈ ఏడాది ఆగస్ట్‌లో ఎన్‌ఎంసీ ప్రకటించింది. ఈ నిబంధనతో ఏపీతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో కొత్త వైద్యకళాశాలల ఏర్పాటుకు అవకాశంలేని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యరంగాన్ని బలోపేతం చేయడంతోపాటు అన్ని ప్రాంతాలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు చేరువ చేయడం, మన విద్యార్థులకు వైద్యవిద్య అవకాశాలు పెంచడం కోసం సీఎం జగన్ ప్రభుత్వం 17 కొత్త వైద్యకళాశాలలు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 2023–24 విద్యాసంవత్సరంలో ఐదు కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి.
2024–25లో మరో ఐదు వైద్యకళాశాలల కోసం ఎన్‌ఎంసీకి దరఖాస్తు చేశారు. తాజా నిబంధనలు అమలు చేస్తామన్న నేపథ్యంలో వీటిపై ఎన్‌ఎంసీ పునఃసమీక్షించాలని కోరుతూ సీఎం వైఎస్ జగన్‌తోపాటు పలు రాష్ట్రాల సీఎంలు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కలిసిన ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఈ నిబంధనలను పునఃపరిశీలించాలని కోరారు. ఈ వినతికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో తాజా నిబంధనలను 2025–26 నుంచి అమలు చేస్తామని ఎన్‌ఎంసీ ప్రకటించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment