
ఆలస్య రుసుంతో వచ్చేనెల 10 వరకు గడువు
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది మార్చిలో జరుగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు ఎస్‌ఎస్‌సీ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. తాజా సవరణ మేరకు 2024–25 విద్యా సంవత్సరంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 18వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. రూ.50 ఆలస్య రుసుంతో 25 వరకు, రూ.200 ఆలస్య రుసుంతో డిసెంబర్ 3 వరకు, రూ.500 లేట్ ఫీజుతో వచ్చేనెల 10వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
ఫీజును www.bse.ap.gov.in లో స్కూల్ లాగిన్‌లో చెల్లించాలని డైరెక్టర్ విజ్ఞప్తి చేశారు. కాగా, ప్రధానోపాధ్యాయులు ఆన్‌లైన్‌లో నామినల్ రోల్స్ సమర్పించేందుకు, ఫీజు చెల్లింపునకు మార్గదర్శకాలను అనుసరించాలని తెలిపారు. ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) ఐడీతో పోల్చి విద్యార్థి నామినల్ రోల్స్‌లో మార్పులు చేసేందుకు హాల్‌టికెట్ జారీకి ముందు ఎడిట్ అవకాశం కల్పిస్తామని డైరెక్టర్ దేవానందరెడ్డి వివరించారు.
ఫీజు వివరాలు ఇలా..
⇒ అన్ని సబ్జెక్టులకు/ మూడు సబ్జెక్టులకు మించి రూ.125
⇒ మూడు సబ్జెక్టుల వరకు రూ.110
⇒ వొకేషనల్ విద్యార్థులు అదనంగా మరో రూ.60
⇒ నిర్ణీత వయసు కంటే తక్కువ ఉన్నవారు రూ.300
⇒ మైగ్రేషన్ సర్టిఫికెట్‌కు రూ.80