( ఫైల్ ఫోటో )
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు వారం రోజులు వాయిదా పడనున్నాయి. మే 2 నుంచి జరగాల్సిన ఈ పరీక్షలు మే 9 లేదా 13 నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ మేరకు విద్యాశాఖ పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు కొన్ని ఒకే తేదీల్లో జరగనుండడమే దీనికి కారణం. జేఈఈ పరీక్షల షెడ్యూల్ వల్ల ఇంటర్ పరీక్షలు వాయిదా వేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
ఇంటర్ పరీక్షలు ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 8 నుంచి 28 వరకు జరగాలి. కానీ జేఈఈ పరీక్షలను ఏప్రిల్ 16 నుంచి 21 వరకు జరిగేలా ఎన్టీఏ తేదీలను ప్రకటించడంతో ఇంటర్ పరీక్షలను వాయిదా వేశారు. ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ప్రకటించారు. టెన్త్ పబ్లిక్ పరీక్షలు మే 2 నుంచి 13వ తేదీ వరకు జరగాల్సి ఉంది. అయితే ఇంటర్, టెన్త్ పరీక్షలు కొన్నిచోట్ల ఒకే సెంటర్‌లో నిర్వహించాల్సి ఉంది.
అక్కడ టెన్త్ పరీక్ష కేంద్రాలను వేరేచోటుకు మార్చడానికి వీలుపడటం లేదు. ఇంటర్, టెన్త్ పరీక్షలు ఒకేసారి జరిగితే రెండిటి ప్రశ్నపత్రాలు, సమాధానాల బుక్‌లెట్లు, ఇతర పరీక్ష సామగ్రి భద్రపరిచేందుకు పోలీసు స్టేషన్లలో వసతి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెండు పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు భద్రతకు, వైద్య ఆరోగ్య సిబ్బంది నియామకానికి కూడా సమస్య వస్తుంది. ఈ నేపథ్యంలో టెన్త్ పరీక్షలను వారం రోజులు వాయిదా వేయాలని విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. మే 9నుంచి లేదా 13నుంచి పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment