అన్ని తరగతుల పరీక్ష పేపర్లను రద్దు చేసిన విద్యాశాఖ
ఎలా లీకయ్యాయనేది తేల్చని అధికారులు
ఈ నెల 11న మొదలైన హాఫ్ ఇయర్లీ పరీక్షలు
విద్యాశాఖపై కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న ప్రభుత్వ నిర్లక్ష్యం
మార్చిలో జరిగే పబ్లిక్ పరీక్షల నిర్వహణపై అనుమానాలు?
సాక్షి, అమరావతి: పదో తరగతి అర్ధ సంవత్సర పరీక్ష పేపర్లు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైన ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. సోమవారం ఉదయం పరీక్ష ప్రారంభమైన గంటలోపే పాఠశాల విద్యాశాఖ తేరుకుని అన్ని తరగతుల పరీక్షలను రద్దు చేసింది. సీల్డ్ కవర్‌లో ఎంతో పకడ్బందీ రక్షణలో ఉంచాలి్సన పరీక్ష పత్రాలు రెండు రోజుల క్రితమే యూట్యూబ్‌లో అప్‌లోడ్ కావడం.. ఎక్కడ లీకైందో ఇప్పటివరకు తెలుసుకోలేకపోవడం చూస్తుంటే ప్రభుత్వ విద్యపై కూటమి సర్కారు తీరుతెన్నులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మార్చి–2025లో జరిగే ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షల నిర్వహణ ఇదే తీరున ఉంటే పరిస్థితి ఏంటన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
అర్ధ వార్షిక పరీక్షల్ని సక్రమంగా నిర్వహించేలేని వారు పబ్లిక్ పరీక్షలు ఇంకెలా నిర్వహస్తారోనని విద్యావేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉదయం లెక్కల పరీక్ష ప్రారంభమైన గంటలోనే మేథ్స్ పేపర్ యూట్యూబ్‌లో ప్రత్యక్షమైందన్న వార్త రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించింది. విషయం తెలియగానే పాఠశాల విద్యాశాఖ సోమవారం ప్రారంభమైన అన్ని పరీక్షలను నిలిపివేయాలని ఆర్జేడీలు, డీఈవోలకు వాట్సాప్ సందేశాలు పంపించి పరీక్షను నిలిపివేశారు. మేథ్స్ పరీక్షను ఈ నెల 20న నిర్వహించాలని ఆదేశించారు. విద్యాశాఖ అధికారుల రక్షణలో ఉండే ప్రశ్నాపత్రాలు ఎలా బయటకు వచ్చాయన్న దానిపై ఆ శాఖ అధికారులు నోరుమెదపడం లేదు.
ప్రభుత్వ నిర్లక్ష్యం తేటతెల్లం
ఈ విద్యా సంవత్సరం పరీక్షలను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. సీల్డు కవర్‌లో ఉంచాలి్సన పేపర్లను ఓపెన్‌గానే అందించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఫార్మెటివ్, సమ్మెటివ్–1 అసెస్‌మెంట్ల పరీక్ష పేపర్లు మండల రిసోర్సు సెంటర్ల (ఎంఈవో కార్యాలయం)లో సీల్డు కవర్‌లో ఉంచి భద్రపరుస్తారు. పరీక్ష జరిగే రోజు ఉదయం సంబంధిత పాఠశాల పరీక్ష ఇన్‌చార్జి టీచర్ వెళ్లి ఉదయం మధ్యాహ్నంజరిగే పేపర్లను ఎంఈవో నుంచి తీసుకుని తమతమ పాఠశాలకు తెచ్చి మిగతా ఉపాధ్యాయుల సమక్షంలో సీలు తెరవాల్సి ఉంటుంది. ఇంత పక్కాగా ఉండే భద్రతను చేధించి యూట్యూబ్‌లో పేపర్లు ప్రత్యక్షం కావడం గమనార్హం.
వాస్తవానికి ఈ నెల 9వ తేదీ నుంచి 1 నుంచి 10వ తరగతి వరకు ఎస్‌ఏ–1 పరీక్షలు జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ నెల 7న మెగా పేరెంట్స్ డే నిర్వహించడం, 14న రెండో శనివారం కావడంతో ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో పరీక్షలను ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తుపాను ప్రభావం ఉండడంతో అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు తదితర జిల్లాల్లోని ప్రభావిత ప్రాంతాల్లో పరీక్షలు నిలిపివేసి, మిగిలిన చోట పూర్తి చేశారు. ఇప్పటివరకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ పేపర్లు పూర్తయ్యాయి.
మార్చి–2025 పబ్లిక్ పరీక్షలపై అనుమానాలు?
ఎస్‌ఏ–1 ప్రశ్నపత్రాల లీకేజీ తర్వాత కొన్ని జిల్లాల్లో ప్రశ్నాపత్రాలను స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇకపై జరిగే పరీక్షలకు అక్కడి నుంచే నేరుగా తీసుకునే ఏర్పాట్లు చేశారు. కాగా, అర్ధ వార్షిక పరీక్ష పేపర్ల లీకేజీతో మార్చి–2025లో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్కారు నిర్లక్ష్యానికి విద్యార్థుల భవిష్యత్ పణంగా పెట్టాలి్సన పరిస్థితి తీసుకొచ్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆరు నెలల కూటమి ప్రభుత్వ పాలనలో బడులను రాజకీయ ప్రచారాలు, ప్రయోగాలకు కేంద్రాలు మార్చేశారని.. పరీక్షల నిర్వహణపై దృష్టి పెట్టలేదనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment