సాక్షి, అమరావతి: రైతులు తమ పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు ఇక ఇబ్బంది ఉండదు. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న బహుళ ప్రయోజన కేంద్రాల (ఎంపీఎఫ్‌ఎస్) తొలిదశ పనులను మార్చి నాటికి సిద్ధం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి వీటి సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. గ్రామస్థాయిలో మెరుగైన మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా ఆర్బీకేలకు అనుబంధంగా రూ. 1,584.61 కోట్లతో 2,536 బహుళ ప్రయోజన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. తొలిదశలో 500 టన్నుల సామర్థ్యంతో 1,021 గోదాములు ఒక్కొక్కటి రూ. 40 లక్షల చొప్పున రూ. 408.40 కోట్లతో నిర్మిస్తుండగా, 1,000 టన్నుల సామర్థ్యంతో 113 గోదాములు ఒక్కొక్కటి రూ. 75 లక్షల చొప్పున రూ. 84.75 కోట్లతో నిర్మిస్తున్నారు. వీటితో పాటు ఆర్బీకేలకు అనుబంధంగా రూ. 166.33 కోట్లతో 8 రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు.
19 ప్యాకేజీల్లో 1,134 గోదాములు
500 టన్నుల గోదాములకు 15 సెంట్ల భూమి, 1,000 టన్నుల గోదాములకు 25 సెంట్ల భూమి అవసరం. స్థలాల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. 962 చోట్ల స్థలాలను మార్కెటింగ్ శాఖకు అప్పగించారు. 500 టన్నుల గోదాములు 6,500 చ.అ.విస్తీర్ణంలోనూ, 1,000 టన్నుల గోదాములు 11 వేల చ.అ.విస్తీర్ణంలోనూ నిర్మిస్తున్నారు. తొలిదశలో రూ. 493.15 కోట్లతో నిర్మిస్తున్న 1,134 గోదాముల కోసం 19 ప్యాకేజీల కింద టెండర్లు ఖరారయ్యాయి. సంబంధిత కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్స్ పూర్తికాగా, పరిపాలనా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే 57 గోదాముల నిర్మాణం పూర్తయింది. ఫినిషింగ్ స్టేజ్‌లో 72, సూపర్ స్ట్రక్చర్ స్టేజ్‌లో 142, బేస్‌మెంట్ స్థాయిలో 290, ఫుటింగ్ స్టేజ్‌లో 179, కాంక్రీట్ స్టేజ్‌లో 89 ఉండగా, మిగిలినవి ఎర్త్ వర్క్ స్టేజ్‌లో ఉన్నాయి. ఇప్పటి వరకు 88.23 కోట్ల విలువైన పనులు పూర్తి కాగా, రూ. 56.02 కోట్ల మేర చెల్లింపులు చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు
మరో వైపు కొనుగోలు కేంద్రాల్లో తేమ పరికరాలు, వేయింగ్ బ్యాలెన్స్‌లు, వేయింగ్ స్కేల్స్, కంప్యూటర్లతో పాటు టార్పాలిన్స్ కొనుగోలు చేస్తున్నారు. వీటిని తొలిదశలో 2,156 కేంద్రాల్లో ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటికే 812 కేంద్రాల్లో వీటి కొనుగోలుకు పరిపాలనా ఆమోదం తెలిపారు. 639 కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలను గుర్తించే ఎస్సైయింగ్ ఎక్యూప్‌మెంట్స్ (లాబ్‌వేర్, తేమ మీటర్లు, వెర్నియర్ కాలిపర్స్) సమకూరుస్తున్నారు. ఇప్పటికే 845 కంప్యూటర్స్, 441 తేమ పరికరాలు, 455 వెయింగ్ బాలెన్స్‌లు, 1068 వేయింగ్ స్కేల్స్‌ను రివర్స్‌టెండరింగ్ ప్రక్రియ ద్వారా కొనుగోలు చేశారు.
వచ్చే సీజన్ నాటికి గోదాములు
తొలిదశలో చేపట్టనున్న గోదాముల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 100 శాతం స్థలాల ఎంపిక పూర్తయ్యింది. నెలవారీ లక్ష్యాలను నిర్దేశించాం. ఈ నెలాఖరుకల్లా కనీసం 50 శాతం పూర్తి కావాలని, మార్చి నాటికి 100 శాతం పూర్తి చేసి ఖరీఫ్ సీజన్ ప్రారంభం నాటికి రైతులకు అందుబాటులోకి తీసుకు రావాలని లక్ష్యంగా ముందుకెళ్తున్నాం.
– రాహుల్ పాండే, కమిషనర్ మార్కెటింగ్ శాఖ
Comments
Please login to add a commentAdd a comment