చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరిక
తిరుపతి అర్బన్: శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత కల్పించాల్సి ఉందని తిరుపతి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. బుధవారం ఆయన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్‌తో కలిసి శ్రీపద్మావతి మహిళా వర్సిటీలోని ఇంజినీరింగ్ కళాశాలలో ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడి అధికారులకు భద్రతా అంశాలపై పలు సూచనలు చేశారు. ఎన్నికల కోడ్ జూన్ 6 వరకు కొనసాగుతుందన్నారు.
జిల్లావ్యాప్తంగా ఈ నెల 14వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 144 సెక్షన్‌ను విధించినట్లు చెప్పారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు 144 సెక్షన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల ముందే కాకుండా ఎన్నికల తర్వాత కూడా ప్రశాంతమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యతను గుర్తు చేశారు. అనవసరంగా వివాదాల జోలికి వెళ్లి భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని సూచించారు.
144 సెక్షన్ నేపథ్యంలో డ్రోన్లు ఎగుర వేస్తే చర్యలు తప్పవని, సభలు, సమావేశాలకు అనుమతి లేదని చెప్పారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలుంటాయన్నారు. పోలీసులు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా పెట్టారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment