AP: పేదల చెంతకు శ్రీమంతుల చదువులు | 2025 IB Syllabus To Start From June For 1st Class, Details Inside - Sakshi
Sakshi News home page

AP: పేదల చెంతకు శ్రీమంతుల చదువులు

Published Wed, Jan 31 2024 5:26 AM | Last Updated on Wed, Jan 31 2024 8:56 AM

2025 IB Syllabus to start from June 1st class - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విద్యా విధానంలో మరో విప్లవాత్మక ఘట్టం ఆవిష్కృతమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంలో బోధన సహా అనేక సంస్కరణలు తెచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేటు పాఠశాలల్లో శ్రీమంతుల పిల్లలు చదువుకునే ‘ఇంటర్నేషనల్‌ బాకలారియెట్‌’ (ఐబీ) సిలబస్‌ను కూడా పేద పిల్లలకు చేరువ చేస్తున్నారు.

ఐబీ సిలబస్‌ అమలుపై బుధవారం సాయంత్రం ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎస్సీఈఆర్టీ) అధికారులతో ఐబీ ప్రతినిధులు ఒప్పందం చేసుకోనున్నారు. దీంతో మన ప్రభుత్వ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడి నెగ్గేలా తీర్చిదిద్దడంలో మరో కీలక అడుగు పడనుంది.

2024 – 25 విద్యా సంవత్సరంలో ఐబీ బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. వారిలో బోధన సామర్థ్యం, నైపుణ్యం పెంచేలా ఈ శిక్షణ ఉంటుంది. టీచర్లతో పాటు మండల, జిల్లా విద్యాధికారులు, ఎస్సీఈఆర్టీ, డైట్‌ సిబ్బంది, ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్‌ బోర్డు సిబ్బందికి ‘ఐబీ’పై అవగాహన, సామర్థ్యం పెంచేలా శిక్షణనిస్తారు. దీంతో వారంతా ప్రతిష్టాత్మక ఐబీ గ్లోబల్‌ టీచర్‌ నెట్‌వర్క్‌లో భాగమవుతారు.

2025 జూన్‌ నుంచి ఒకటో తరగతిలో ఐబీ సిలబస్‌ బోధన ప్రారంభమవుతుంది. ఏటా ఒక్కో తరగతికి ఈ సిలబస్‌ను పెంచుతూ 2035 నాటికి 10వ తరగతి, 2037కి 12వ తరగతిలో అమలు చేస్తారు. పరీక్షల అనంతరం ఐబీ బోర్డు, ఏపీఎస్సీఈఆర్టీ ఉమ్మడిగా సర్టిఫికెట్‌ను ప్రదానం చేస్తాయి. ఈ సర్టిఫికెట్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు సైతం ఉంటుంది.



2019 నుంచే గ్లోబల్‌ సిటిజన్స్‌ ప్రణాళిక
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను గ్లోబల్‌ విద్యార్థులుగా తీర్చిదిద్దే ప్రక్రియను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 2019 నుంచే ప్రారంభించింది.  ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులు ఉత్తమంగా ఎదిగేందుకు 56 నెలల్లో దాదాపు రూ.73 వేల కోట్లు విద్యా సంస్కరణల కోసం వెచ్చించింది. నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్‌ స్కూళ్లకంటే మిన్నగా తీర్చి దిద్దుతోంది. జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద తదితర విప్లవాత్మక కార్యక్రమాలను అమలు చేసి విద్యార్థుల ఉన్నతికి బాటలు వేసింది. ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లిష్‌ మీడియంలో బోధన ప్రారంభించింది.

మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. పాఠశాలలను సీబీఎస్‌ఈ బోర్డుకు అనుసంధానించింది. విద్యార్థులకు బైలింగ్యువల్‌ టెక్టŠస్‌ బుక్స్‌ నుంచి ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ వరకు 9 వస్తువులతో కూడిన జగనన్న విద్యా కానుక కిట్‌ను అందిస్తోంది. పిల్లల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచడంతో పాటు సులభంగా ఇంగ్లిష్‌ అర్థమయ్యేలా మార్పులు చేసింది. నాలుగు నుంచి 12వ తరగతి వరకు ఉచిత బైజూస్‌ కంటెంట్, 8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు బైజూస్‌ కంటెంట్‌తో ఉచిత ట్యాబ్స్‌ పంపిణీ చేసింది.

హై స్కూల్   స్థాయిలో ప్రతి తరగతి గదిలో డిజిటల్‌ బోధన కోసం 62 వేల ఐఎఫ్‌పీలు ఏర్పాటు చేస్తోంది. ప్రాథమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్‌ టీవీలు, ఇంగ్లిష్‌ ల్యాబ్స్‌ ఏర్పా­టు చేసింది. ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులు స్పోకెన్‌ ఇంగ్లిష్‌లో నైపుణ్యం సాధించేందుకు మూడో తరగతి నుంచి టోఫెల్‌ శిక్షణనిస్తోంది. ఐబీ సిలబస్‌ను సులభంగా అర్థం చేసుకునేందుకు, అంతర్జాతీయ ప్రమాణాలను 
అందుకునేందుకు ఈ మార్పులు  దోహదం చేస్తాయి.

ఐబీ విద్యా బోధనలో ఎన్నో ప్రత్యేకతలు 
ఐబీ విద్య ప్రపంచంలోనే అత్యుత్తమ బోధన పద్ధతిగా గుర్తింపు పొందింది. బట్టీ చదువులకు స్వస్తి చెబుతూ థియరీతో పాటు ప్రాక్టికల్‌ అప్లికేషన్‌ పద్ధతిలో బోధన సాగుతుంది. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుంది. ప్రస్తుత, భావితరాల అవసరాలకు అనుగుణంగా సిలబస్, బోధన, మూల్యాంకనం ఉంటుంది. చదువుతోపాటు ప్రాక్టికల్స్, విద్యార్థుల్లో నైపుణ్యాల (స్కిల్స్‌)కు ప్రాధాన్యతనిస్తారు.

సంగీతం, నృత్యం, క్రీడలు వంటి ఇతర అంశాల్లోనూ తర్ఫీదు ఇస్తారు. ఇంటర్‌ డిసిప్టీనరీ కాన్సెప్ట్‌ (వాస్తవిక జీవిత అంశాలు) ఆధారంగా బోధన సాగుతుంది. ఈ సిలబస్‌ను అభ్యసించిన విద్యార్థులు ఇతరులతో పోలిస్తే ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీల్లో మూడు రెట్లు అధికంగా ప్రవేశాలు పొందుతున్నారు. ప్రపంచస్థాయి ఉద్యోగావకాశాలను సైతం వేగంగా అందుకుంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement