తిరుపతి రూరల్: వైఎస్సార్సీపీ శ్రేణులతో చంద్రగిరి జన సంద్రమైంది. ఆత్మీయ సమ్మేళనం జన ఉప్పెనను తలపించింది. ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నాయకత్వంలో తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతి రూరల్ మండలంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. దాదాపు 25 వేల మందికి పైగా హాజరయ్యారు. ఆత్మీయ సమ్మేళనానికి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి ఆర్కే రోజా, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప, డాక్టర్ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే జయదేవనాయుడు పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీకి చంద్రగిరి నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చారని, నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణ, అంకితభావంతో చెవిరెడ్డి రాజకీయాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించారని పలువురు కొనియాడారు. రానున్న ఎన్నికల్లో చంద్రగిరి ఎమ్మెల్యేగా చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని ఆదరించాలని నాయకులంతా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎంవైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోత్సాహంతో పార్టీలకు అతీతంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులను చేపట్టినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment