జిమ్‌కు వెళ్లొస్తూ కుప్పకూలాడు | 25-year-old man died of a heart attack at Adoni | Sakshi
Sakshi News home page

జిమ్‌కు వెళ్లొస్తూ కుప్పకూలాడు

Published Sun, Feb 26 2023 4:26 AM | Last Updated on Sun, Feb 26 2023 2:32 PM

25-year-old man died of a heart attack at Adoni - Sakshi

ఆదోని అర్బన్‌: ఆదోని పట్టణ శివారులోని ఆర్ట్స్‌ కళాశాల రోడ్డులో గల జిమ్‌లో వ్యాయామం చేసి బయటకు వచ్చిన ఓ యువకుడు గుండెపోటుతో కుప్పకూలి మరణించిన ఘటన శనివారం చోటుచేసుకుంది.  పట్టణంలోని తిరుమలనగర్‌కు చెందిన సాయిప్రభు (25) ప్రతిరోజూ ఉదయాన్నే 6 గంటలకు జిమ్‌కు వెళ్లి వ్యాయామాలు చేస్తుంటాడు.

శనివారం ఉదయాన్నే వాకింగ్‌కు పూర్తి చేసుకున్న సాయిప్రభు జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేశాడు. ఆ తర్వాత బయటకు వచ్చి స్పృహ తప్పి పడిపోగా.. స్నేహితులు గమనించి వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు గుండెపోటుతో మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

మే 3న వివాహం
తిరుమలనగర్‌కు చెందిన మల్లికార్జున ఆచారి, పుష్పవతి దంపతులకు ముగ్గురు సంతానం. ఆచారి కార్పెంటర్‌ కాగా.. పెద్ద కుమారుడికి, రెండో కుమార్తెకు వివాహాలు చేశాడు. మూడో కుమారుడు సాయిప్రభు బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం అతడు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ కింద ఇంటినుంచే పని చేస్తున్నాడు.

అతనికి బెంగళూరుకు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. మే 3వ తేదీన ముహూర్తం నిర్ణయించగా.. కుటుంబ సభ్యులు ఆ ఏర్పాట్లలో ఉండగా.. ఈ దారుణం చోటుచేసుకుంది. సాయిప్రభు మరణించిన విషయం తెలిసిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement