సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చేనేత కుటుంబాలకు నేతన్న నేస్తంతోపాటు అనేక సంక్షేమ ఫలాలను అందిస్తున్న ప్రభుత్వం నగదు పరపతి కూడా సమకూరుస్తోంది. మగ్గాల ఆధునికీకరణతోపాటు చేనేత సామగ్రి కొనుగోలు, మార్కెటింగ్‌కు అనేక రూపాల్లో ఊతమిస్తోంది. చేనేత కుటుంబాలకు భరోసా ఇచ్చేలా వరుసగా ఐదు విడతల్లో నేతన్న నేస్తం ద్వారా రూ.969.77 కోట్లు అందించిన సంగతి తెలిసిందే.
సొంత మగ్గం కలిగిన ప్రతి నేతన్నకూ ఏడాదికి రూ.24 వేలు చొప్పున ఐదు విడతల్లో రూ.1.20 లక్షలు అందించింది. ఈ పథకం అమలు తర్వాత చేనేత కార్మికులు తమ మగ్గాలను డబుల్ జాకార్డ్, జాకార్డ్ లిఫ్టింగ్ మెషిన్ తదితర ఆధునిక పరికరాలతో అప్‌గ్రేడ్ చేసి కొత్త డిజైన్లతో నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేస్తూ జీవితాలను మెరుగుపర్చుకున్నారు. దీంతోపాటు నేతన్నల పెన్షన్ కోసం రూ.1,396.45 కోట్లు ఇచ్చింది. చేనేత రంగానికి ఊతమిచ్చేలా ఆప్కోకు రూ.468.84 కోట్లు (గత ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లతో కలిపి) చెల్లించింది.
నేతన్న నేస్తం, నేతన్న పెన్షన్, ఆప్కోకు సాయం వంటి మూడు పథకాల ద్వారానే నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.2,835.06 కోట్లను వెచ్చించింది. గత ప్రభుత్వం నేతన్నల కోసం ఐదేళ్లలో కేవలం రూ.442 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కేవలం నాలుగేళ్లలోనే నవరత్నాలు తదితర సంక్షేమ పథకాల ద్వారా మొత్తం రూ.3,706 కోట్లు ఖర్చు చేయడం విశేషం. ఇవి కాకుండా బ్యాంకుల ద్వారా రుణాలు సైతం అందిస్తోంది.
సహకార బ్యాంకుల ద్వారా రుణాలు
వస్త్రాల ఉత్పత్తి, మార్కెటింగ్ కోసం ప్రాథమిక చేనేతకారుల సహకార సంఘా(పీహెచ్‌డబ్ల్యూపీఎస్)లకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల ద్వారా ఆర్థిక సహకారం అందిస్తోంది. రాష్ట్రంలో 681 చేనేత సొసైటీలకు రూ.209.29 కోట్లు నగదు పరపతి (రుణాలు) అందించింది.
Comments
Please login to add a commentAdd a comment