కూటమి రేపిన కలకలం...మైనార్టీల్లో కలవరం! | 4 percent reservation for Muslims in 2004 | Sakshi
Sakshi News home page

కూటమి రేపిన కలకలం...మైనార్టీల్లో కలవరం!

Published Sat, May 18 2024 5:47 AM | Last Updated on Sat, May 18 2024 6:53 AM

4 percent reservation for Muslims in 2004

2004లో ముస్లిములకు 4 శాతం రిజర్వేషన్లు 

డాక్టర్‌ వైఎస్సార్‌ కల్పించిన వరం... 

గత పదేళ్లలో ఆరువేలమందికిపైగా డాక్టర్లయిన ముస్లిం యువత 

విద్యా ఉద్యోగాల్లో ముస్లిం యువత ముందడుగు.. 

రిజర్వేషన్లను కొనసాగిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ మరింత ఊతం 

కూటమి విష ప్రచారానికి ముస్లిం సమాజం బెంబేలు..

ఒకే ఒక్క నిర్ణయం...ఇంతమంది జీవితాల్లో ఇంత అద్భుతమైన మార్పు తెస్తుందని ఎవరూ  ఊహించరు...దివంగత మహానేత డాక్టర్‌  వైఎస్సార్‌ పేదరికంలో ఉన్న ముస్లింల వేదనలకు చలించిపోయి, వారి ఎదుగుదలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు...అంతే..ఆ ఒక్క నిర్ణయం ముస్లిం సమాజంలో విద్యావంతులను  అమాంతంగా పెంచింది... వారిలో అనేకులు డాక్టర్లు, ఇంజనీర్లుగా ఎదుగుతున్నారు.

ఇతరత్రా అనేక ఉపాధి కోర్సుల్లో  ముస్లిం యువత ప్రతిభను చూపించి, మున్ముందుకు దూసుకుపోతోంది...ఒక సాధారణ టీవీ మెకానిక్‌ తన ఇద్దరు కుమార్తెలను, ఒక కుమారుణ్ని  డాక్టర్లను చేశారంటే అది వారికి లభించిన రిజర్వేషన్‌ ఫలితమే... మరెన్నో ముస్లిం పేద కుటుంబాల్లో యువతీయువకులు నేడు ఉన్నత విద్యావంతులై... తమ కుటుంబాలకు..సమాజానికి గుర్తింపును తెస్తున్నారు.. 

ఇలాంటి మంచి వాతావరణాన్ని కలుషితం చేసేలా బీజేపీ ముస్లింలకు రిజర్వేషన్లను తొలగిస్తామని ఇటీవల ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రకటించడం ఆ సమాజంలో అలజడి  రేపుతోంది... రేపటి తమ భవిష్యత్తును తలచుకుని ముస్లింలు తల్లడిల్లుతున్నారు..  


యిర్రింకి ఉమామహేశ్వరరావు,  సాక్షి, అమరావతి:  కడపలో డాక్టర్‌ నూరీ పర్వీన్‌ పేరు తెలియని వారుండరు. కడప పెద దర్గా సెంటర్‌లో కేవలం రూ.10కే వైద్య సేవలు అందించే పది రూపాయల డాక్టర్‌గా ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నారామె. దివంగత మహానేత వైఎస్సార్‌ కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్లతో ఎంబీబీఎస్‌ చదువుకున్న ఆమె ఆయన స్ఫూర్తితో పది రూపాయలకే వైద్యం చేయడం ప్రారంభించారు.

ఆమెతో పాటు సోదరి రీనా పర్వీన్, తమ్ముడు బాబా మొహిద్దీన్‌లూ  డాక్టర్లే. వీరి తండ్రి ఎండీ మక్బూల్‌  విజయవాడలో ఓ టీవీ మెకానిక్‌. తమ పేద కుటుంబం నుంచి ఏకంగా వరుసగా...ముగ్గురు డాక్టర్లుగా ఎదగడం దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్సార్‌ పుణ్యమేనని మక్బూల్‌ సంతోషంగా చెబుతారు.      

విజయవాడలో కనీసం సొంత ఇల్లయినా లేని మక్బూల్‌ టీవీ మెకానిక్‌గా కుటుంబాన్ని పోషించడమే కష్టతరంగా ఉండేది. ఇలాంటి క్లిష్టమైన సమయంలో  వైఎస్సార్‌  ముస్లింలకు కల్పించిన రిజర్వేషన్‌ ఫలితంగా ఆయన ఇద్దరు కుమార్తెలు, కుమారుడు 2010, 2011, 2012 సంవత్సరాల్లో వరుసగా ఎంబీబీఎస్‌ సీట్లు సాధించడం ఓ అరుదైన ఘనత.    

...వీరే కాదు.. దివంగత మహానేత వైఎస్సార్‌ కల్పించిన నాలుగు శాతం (బీసీ–ఇ) రిజర్వేషన్‌ రాష్ట్రంలో వేలాది ముస్లిం కుటుంబాల స్థితిగతులనే మార్చేసింది. సామాజికంగా, విద్య పరంగా అత్యంత వెనుకబాటుకు గురైన ముస్లిం సమాజాన్ని గుర్తించి వారిని ముందుకు నడిపించేందుకు వైఎస్సార్‌ తీసుకున్న రిజర్వేషన్‌ కేటాయింపు  నిర్ణయం ఎన్నో ముస్లిం కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంది. ఆ కుటుంబాల్లో యువతను విద్యాధికులను చేసింది. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004లో వైఎస్సార్‌ ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్‌ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వేలాది మంది ముస్లిం యువతకు భరోసా ఇచ్చింది. రాష్ట్ర విభజన అనంతరం ఒక్క ఏపీలోనే ఈ పదేళ్లలో వైద్య విద్యా కోర్సుల్లో 6,401 మందికి అండర్‌ గ్రాడ్యుయేషన్, 1,164 మందికి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ అవకాశాలు దక్కడం విశేషం. వైద్య విద్యా కోర్సులతో పాటు ఇంజనీరింగ్, ఇతర కోర్సుల్లో అవకాశాలు దక్కినవారు లెక్కలు మిక్కిలి ఉన్నారు. 

విజయవాడకు చెందిన డాక్టర్‌ అస్మా తన్విర్‌రిజర్వేషన్‌ అవకాశంతో పిన్నమనేని సిద్ధార్థ మెడికల్‌ కాలేజీలో 2014లో 
ఎంబీబీఎస్, ఆ తర్వాత 2019లో జనరల్‌ సర్జన్‌ (ఎంఎస్‌) వైద్య విద్య సీట్లు సాధించారు. ప్రస్తుతం డాక్టర్‌ వృత్తిని కొనసాగిస్తున్నారామె. ఆమె తండ్రి షేక్‌ కలీముద్దీన్‌ రిటైర్డ్‌ ఉద్యోగి. పిల్లల చదువులు తనకు భారమైనప్పటికీ రిజర్వేషన్‌ అవకాశంతో ఒక కుమార్తె డాక్టర్, ఇద్దరు కుమార్తెలు ఇంజనీరింగ్, కుమారులు వేర్వేరు కోర్సులను పూర్తి చేయడంతో ఆ కుటుంబం ఉన్నతంగా జీవిస్తోంది. 

వైఎస్సార్‌ హామీ ఇచ్చి అమలు చేశారు 
ముస్లిం రిజర్వేషన్లపై 2009 ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన వైఎస్సార్‌ అధికారం చేపట్టిన వెంటనే అమలు చేశారు. తొలుత ఐదు శాతం ప్రకటించినప్పటికీ 50 శాతం రిజర్వేషన్లు దాటకూడదని సుప్రీం కోర్టు అభ్యంతరంతో నాలుగు శాతం అమలు చేశారు. వైఎస్సార్‌ ఇచ్చిన రిజర్వేషన్ల వల్ల ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా మంది ముస్లిం యువకులు, విద్యార్ధులు లబ్ధి పొందుతున్నారు. 

తమకు అందివచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వీరంతా తమలోని ప్రతిభను నిరూపించుకుంటున్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, డీఎస్పీలు, ఆర్డీవోలు, టీచర్‌లుగా ఉద్యోగాలు పొందుతున్నారు. ఈ సంతోషాన్ని హరించే కుట్రలో భాగంగా...  వైఎస్సార్‌ కల్పించిన రిజర్వేషన్లను తొలగించడానికి   కూటమి కుట్రలు చేస్తోంది. ముస్లింలలోని నిమ్న కులాల వారికి సమాజంలో ఉన్న సామాజిక, విద్యాపరమైన వెనుకబాటు కారణంగా రిజర్వేషన్లు అందుతున్నాయి. – అసదుద్దీన్‌ ఒవైసీ, ఎంఐఎం ఎంపీ  

వైఎస్సార్‌ బాటలో సీఎం వైఎస్‌ జగన్‌ 
రిజర్వేషన్లతో ముస్లింల తలరాతలను మార్చిన దివంగత వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ వంటి గొప్ప పథకాన్ని అమలు చేసి అన్ని వర్గాల పేదల ఆరోగ్యానికి భరోసా ఇచ్చారు. వైఎస్సార్‌ పేరు చెబితే ముస్లింలకు రిజర్వేషన్లు, పేదలకు ఆరోగ్య శ్రీ గుర్తుకొస్తాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన తండ్రి కంటే రెండడుగులు ముందుకేసి వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు చేశారు. 

ముస్లిం రిజర్వేషన్లు కొనసాగించిన సీఎం వైఎస్‌ జగన్‌ నాడు–నేడు ద్వారా ఆస్పత్రులు, మెడికల్‌ కాలేజీలను ఆధునికీకరణ చేసి అన్ని మౌలిక సదు­పా­యాలను కల్పించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎం వైఎస్‌ జగన్‌ వైద్య రంగంలో సుమారు 50 వేలకు పైగా పోస్టులను భర్తీ చేశారు. కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేయగా, వాటిలో ఐదు కాలేజీలను ప్రారం­భించారు. 

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా ఫ్యామిలీ డాక్టర్, డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ విలేజ్, అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌లను ప్రారంభించారు. రాష్ట్రంలోని 92 శాతం మంది ప్రజలకు ఆరో­గ్యశ్రీ ద్వారా చికిత్స పొందే వెసులుబాటు కల్పిం­చిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  చరిత్ర సృష్టించారు.   –మహబూబ్‌ షేక్, వైద్య నిపుణుడు, విజయవాడ 

ముస్లిం రిజర్వేషన్లు మతపరమైనవి కావు 
ఆర్థికంగా, సామాజికంగా, విద్యా పరంగా వెనుకబడిన ముస్లింలను గుర్తించి 2004లో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి రిజర్వేషన్లు కల్పించారు. 2004 ఎన్నికల్లో తానూ  ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో అధికారం చేపట్టిన వైఎస్సార్‌ రిజర్వేషన్లు కల్పిస్తే వాటిని అడ్డుకునేందుకు చంద్రబాబు కోర్టులో కేసులు వేయించారు.

 4 శాతం రిజర్వేషన్ల వల్ల ముస్లిం యువతకు ఉన్నత విద్యావకాశాలు దక్కుతున్నాయి. ఎంతోమంది ముస్లిం యువత ఇప్పుడు బాగా చదువుకుని ఉన్నతంగా జీవిస్తున్నారు. రిజర్వేషన్లు ముస్లిం సమాజంలో గొప్ప సానుకూల మార్పును తెచ్చాయి.   –షేక్‌ మునీర్‌ అహ్మద్, ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వినర్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement