4 ట్రిపుల్‌ ఐటీలకు 48 వేల దరఖాస్తులు | 48 thousand applications for 4 triple ITs | Sakshi
Sakshi News home page

4 ట్రిపుల్‌ ఐటీలకు 48 వేల దరఖాస్తులు

Published Wed, Jun 12 2024 5:20 AM | Last Updated on Wed, Jun 12 2024 5:21 AM

48 thousand applications for 4 triple ITs

2024–25 విద్యా సంవత్సరానికి కొనసాగుతున్న అడ్మిషన్లు 

ఆర్జీయూకేటీ పరిధిలో మొత్తం సీట్లు 4,400 

ఈ నెల 25 వరకు గడువు..  50 వేలకు చేరనున్న దరఖాస్తులు

నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీలకు సంబంధించిన అడ్మిషన్లలో భాగంగా మంగళవారం వరకు 48 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీల్లో 2024–25 అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఆర్జీయూకేటీ ఉన్నతాధికారులు మే 6న విడుదల చేశారు. 

ఈ నెల 8 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తుకు ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువుంది. ఇంతవరకూ నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో కలిపి 4,000 సీట్లతో పాటు ఈడబ్ల్యూఎస్‌  కింద మరో 400 సీట్లు ఉన్నాయి. మొత్తం 4,400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 

పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన వారికి రిజర్వేషన్‌ అనుసరించి ట్రిపుల్‌ ఐటీల్లో సీట్లు భర్తీ చేస్తారు. దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసే నాటికి 50 వేల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ట్రిపుల్‌ఐటీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

జూలై ఒకటి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌  
సీటు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రత్యేక కేటగిరి అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ జూలై ఒకటి నుంచి నిర్వహించనున్నారు. సైనిక ఉద్యోగుల పిల్లలకు జూలై ఒకటి నుంచి 3 వరకు, క్రీడా కోటా అభ్యర్థులకు జూలై 3 నుంచి 6వ తేదీ వరకు, దివ్యాంగుల కోటా అభ్యర్థులకు జూలై 3న, భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కోటా అభ్యర్థులకు జూలై 2, 3 తేదీల్లో, ఎన్‌సీసీ కోటా అభ్యర్థులకు జూలై 3 నుంచి 5వ తేదీ వరకు పరిశీలించనున్నట్లు ట్రిపుల్‌ ఐటీ అధికార వర్గాలు తెలిపాయి.

 జూలై 11న ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. 22, 23 తేదీల్లో నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీల్లో, 24, 25 తేదీల్లో ఒంగోలు ట్రిపుల్‌ ఐటీలో, 26, 27 తేదీల్లో శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement