జూలైలో రూ.9,000 కోట్ల రుణ భారం
మూడు నెలల్లో మొత్తం రూ.17 వేల కోట్ల అప్పులు
ఆర్‌బీఐకి సమాచారం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
ఇప్పటికే గత నెలలో రూ.2,000 కోట్లు అప్పు
అప్పుల మోతపై కిక్కురుమనని ఎల్లో మీడియా
చంద్రబాబు చెబుతున్న సంపద సృష్టి ఇలాగేనా?
విస్మయం వ్యక్తం చేస్తున్న ఆర్థిక నిపుణులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఒక్క రోజే రూ.5,000 కోట్లు అప్పు చేసింది. అంతే కాదు.. ఈ నెలలోనే మరో రూ.4,000 కోట్లు అప్పులు చేయడం ద్వారా ఒక్క జూలైలోనే మొత్తం రూ.9,000 కోట్లు రుణ భారం మోపనుంది. తొమ్మిదేళ్ల కాల వ్యవధితో రూ.1,000 కోట్లు, 12 ఏళ్ల కాల వ్యవధితో రూ.1,000 కోట్లు, 17 ఏళ్ల కాల వ్యవధితో రూ.1,000 కోట్లు, 21 ఏళ్ల కాల వ్యవధితో రూ.1,000 కోట్లు 24 సంవత్సరాల కాల వ్యవధితో రూ.1000 కోట్ల మేర తాజాగా కూటమి సర్కారు అప్పులు చేసింది.
7.36 శాతం నుంచి 7.37 శాతం వరకు వడ్డీతో ఈ అప్పులు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఆర్బీఐ ఈ అప్పులను సమీకరించింది. ఈ ఆర్ధిక ఏడాదిలో జూలై నుంచి సెప్టెంబర్ వరకు మూడు నెలల్లో మొత్తం రూ.17 వేల కోట్లు అప్పులు చేయనున్నట్టు చంద్రబాబు సర్కారు ఆర్బీఐకి తెలిపింది.
ఇందులో జూలైలో రూ.9,000 కోట్లు అప్పు చేయనుండగా ఆగస్టు, సెప్టెంబర్‌లో రూ.8,000 కోట్లు అప్పు చేయనున్నట్లు సమాచారం అందచేసింది. ఈ మేరకు ఏ మంగళవారం ఎంత అప్పులు తీసుకుంటారో వెల్లడించింది. కాగా ఇప్పటికే గత నెలలో కూటమి సర్కారు రూ.2,000 కోట్లు అప్పు చేయడం తెలిసిందే.
నాడు గగ్గోలు..
ప్రతి మంగళవారం అప్పు చేయనిదే పూట గడవదంటూ వైఎస్ జగన్ సర్కారుపై పదేపదే విషం కక్కిన ఎల్లోవీుడియా ఇప్పుడు రూ.వేల కోట్ల అప్పులు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నా కిక్కురుమనకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. గత సర్కారు ఆచితూచి అప్పులు చేస్తే అదేదో మహాపరాథం అన్నట్లుగా నిత్యం గగ్గోలు పెట్టిన ఓ వర్గం మీడియాకు తాజా పరిణామాలు కంటికి కనిపించడం లేదా? అని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబు చేస్తున్న అప్పులు సంపద సృష్టిస్తున్నట్లుగా కనిపిస్తున్నాయా? అని ఎద్దేవా చేస్తున్నారు. గత సర్కారు పరిమితికి లోబడే అప్పులు చేసినా రాష్ట్రం శ్రీలంక మాదిరిగా అయిపోతోందంటూ ఎల్లో మీడియా పదేపదే విషం చిమ్మిన వైనాన్ని ప్రస్తావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment