
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో 59,062 మందికి ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. వీరందరికీ మే 1వ తేదీ నుంచి పింఛను డబ్బులు చెల్లించనున్నారు. 4,431 మంది దీర్ఘకాలిక అనారోగ్య బాధితులతోపాటు 54,631 మందికి వృద్దాప్య, వితంతు, దివ్యాంగ తదితర పింఛన్లు కొత్తగా మంజూరయ్యాయి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక 23 నెలల్లో తాజాగా మంజూరు చేసిన వాటితో కలిపి 14.17 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసినట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో రాజాబాబు వెల్లడించారు. 2020 జనవరి నుంచి ఈ ఏడాది జనవరి వరకు 13.58 లక్షల మందికి ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేయగా తాజాగా మంజూరైన వాటితో కలిపి 14.17 లక్షలకుపైగా చేరుకున్నట్లు వివరించారు.
మొత్తం 61.45 లక్షల మంది..
పక్షవాతంతో మంచానికి/వీల్ చైర్‌కి పరిమితమైన 1,875 మందికి తాజాగా మే నెల నుంచి పింఛన్లు మంజూరయ్యాయి. కండరాల బలహీనతతో నడవలేని స్థితిలో ఉన్న 594 మందికి, ఇతర అనారోగ్య సమస్యలున్న 124 మందికి కూడా పింఛన్లు మంజూరయ్యాయి. 29,042 వృద్ధాప్య, 17,023 వితంతు, 10,404 దివ్యాంగ పింఛన్లను కూడా ప్రభుత్వం తాజాగా మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో మే 1న మొత్తం 61.45 లక్షల మందికి ప్రభుత్వం రూ.1,483.69 కోట్లను పింఛన్ల రూపంలో పంపిణీ చేయనుంది. వలంటీర్లే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛను డబ్బులు పంపిణీ చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment