సాక్షి, పశ్చిమగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చేరుకున్నారు. హెలీప్యాడ్ నుంచి నేరుగా ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న సీఎం అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. సీఎం జగన్ వెంట మంత్రి పేర్ని నాని, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. బాధితుల పరామర్శ అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం దేవరపల్లికి చేరుకొని గోపాలపురం ఎమ్మెల్యే తల్లారి వెంకట్రావు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు.
కాగా, ఏలూరులో పలువురు అస్వస్థతకు గురైన విషయం తెలియగానే సీఎం జగన్ ఆదివారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనానితో మాట్లాడారు. తక్షణం తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులను స్వయంగా పరామర్శించడమే కాకుండా వారికి అందుతున్న చికిత్సను పర్యవేక్షించాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రి నాని ఆదివారం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించడమే కాకుండా వైద్యపరంగా తీసుకోవాల్సిన చర్యలను అధికారులతో స్వయంగా పర్యవేక్షించారు. సీఎం ఆదేశాలతో వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు కూడా ఏలూరులో బాధితులను పరామర్శించి అస్వస్థతకు దారితీసిన కారణాలపై పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు దారితీసిన కారణాలు, పరిస్థితులను స్వయంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి ఏలూరులో పర్యటించి అధికారులతో సమావేశంకానున్నారు. చదవండి: (సర్కారు బాసట.. కోలుకుంటున్నారు)
Comments
Please login to add a commentAdd a comment