బియ్యం ఎగుమతులకు సర్కారు మోకాలడ్డు
ఎగుమతిదారుల్లో వైఎస్సార్‌సీపీ వారున్నారంటూ కుట్రలు
గద్దెనెక్కగానే కూటమి ప్రభుత్వం వేధింపుల పర్వం
కాండ్లా పోర్టు వైపు ఎగుమతిదారుల చూపు
ఉపాధి కోల్పోనున్న దాదాపు 20 వేల మంది
బియ్యం ఎగుమతుల్లో కాకినాడ పోర్టు దేశంలోనే రికార్డులు తిరగరాసింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వ వేధింపులతో కుదేలవుతోంది. విదేశాలకు బియ్యం ఎగుమతి చేసేందుకు కేంద్రం నుంచి అన్ని అనుమతులున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మోకాలడ్డుతోంది. ఎగుమతిదారుల్లో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులున్నారన్న ఏకైక సాకుతో ఈ పోర్టుపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడ్డ దాదాపు 20 వేల మంది పొట్టుకొట్టి వారిని రోడ్డున పడేస్తోంది. ఈ నేపథ్యంలో బియ్యం ఎగుమతిదారులు ఈ పోర్టులో కార్యకలాపాలకు ఫుల్‌స్టాప్ పెడుతున్నారు. ప్రత్యామ్నాయంగా కాండ్లా పోర్టు వైపు అడుగులేస్తున్నారు.
మంత్రి నాదెండ్ల హడావుడి
ఎగుమతిదారుల్లో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులున్నారన్న ఏకైక కారణంతో కాకినాడ పోర్టులో ఎగుమతులను దెబ్బదీసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నింది. సార్వత్రిక ఎన్నికల ముందు నుంచే చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు ఈ పోర్టుపై విషం కక్కుతూ వచ్చారు. ఈ పోర్టు ద్వారా విదేశాలకు పీడీఎస్ బియ్యం దొడ్డిదారిన ఎగుమతి చేస్తున్నారంటూ నిందలు వేశారు. రెండు తరాలుగా రైస్ ఇండస్ట్రీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కుటుంబాన్ని, వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైన ఎగుమతిదారులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కుట్రలు చేసింది.
గత నెలలో కాకినాడ పోర్టు ఆధారిత ఎగుమతిదారుల గోడౌన్‌లపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యవేక్షణలో అధికారులు దాడులు చేసి సుమారు 50 వేల మెట్రిక్ టన్నుల బియ్యంతో పాటు నూకలను సీజ్ చేసి ఎగుమతిదారుల్లో భయానక వాతావరణాన్ని సృష్టించారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా సీజ్ చేసిన సరుకులో 28 వేల మెట్రిక్ టన్నుల సరుకు సీజ్ ఎత్తేసి ఇటీవలే విడుదల చేశారు. ఆ తర్వాత ఎగుమతులకు పలు విధాలుగా ప్రతిబంధకాలు సృష్టిస్తున్నారు.
చెక్‌పోస్టుల ద్వారా రోజుల తరబడి ఎగుమతులు నిలిచిపోయేలా చేస్తున్నారు. కావాలనే పనిగట్టుకుని జరుగుతున్న ఈ వేధింపుల కారణంగా ఎగుమతిదారులు కాకినాడ పోర్టులో కార్యకలాపాలను నిలిపివేస్తున్నారు. ప్రత్యామ్నాయంగా కాండ్లా పోర్టు వైపు తరలిపోవాలనే నిర్ణయంతో సెప్టెంబర్ నుంచి ఇక్కడ ఎగుమతులు పూర్తిగా నిలిచిపోనున్నాయి.
సాక్షి ప్రతినిధి, కాకినాడ : బియ్యం ధరలను నియంత్రించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట ముడి బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. అత్యవసర అవసరాల దృష్ట్యా ఆఫ్రికా దేశాల విజ్ఞప్తితో కేంద్రం మానవతా దృక్పథంతో ప్రభుత్వ రంగ సంస్థల పర్యవేక్షణలో బియ్యం, నూకలు కలిపి 1.5 మెట్రిక్ టన్నుల ఎగుమతికి అనుమతించింది. ఇవి కాకుండా ఆఫ్రికా దేశం సెనగల్‌కు 5 లక్షల టన్నుల నూకల ఎగుమతికి అనుమతి వచ్చింది. గత జూలై నెలాంతానికి 2.5 లక్షల టన్నుల ఎగుమతి పూర్తి చేశారు. ఇవన్నీ డైరెక్టర్ జనరల్ ఫారెన్ ట్రేడ్ పర్యవేక్షణలో జరుగుతాయి.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన నాఫెడ్, ఎన్‌సీఈఎల్(నేషనల్ కోపరేటివ్ ఎక్స్‌పోర్ట్సు లిమిటెడ్), ఎన్‌సీసీఎఫ్(నేషనల్ కోపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్), క్రిబ్‌కో నిర్వహించిన వేలంలో ఎక్స్‌పోర్టు కంపెనీలు ఎగుమతి హక్కులు దక్కించుకున్నాయి. దుబాయ్, స్విట్జర్లాండ్ లిమిటెడ్ కంపెనీలతో పాటు సింగపూర్ కేంద్రంగా నిర్వహించే ఓలం ఆగ్రో, అంతర్జాతీయంగా పేరున్న లూయీస్ బ్రూఫిన్, ఢిల్లీ, రాయ్‌పూర్, రాజస్థాన్ ప్రాంతాలకు చెందిన డీఆర్ కమోడిటీస్, బాలాజీ రైస్ ఇండస్ట్రీస్, శ్రీరామ్‌ఫుడ్స్, పట్టాభి ఇంటర్నేషనల్, సరళ ఫుడ్స్ వంటి కంపెనీలు కాకినాడ పోర్టు నుంచి నూకలు, బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేయడానికి సిద్ధమయ్యాయి.
దాదాపు 150 ఎగుమతి కంపెనీలు ది రైస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ సభ్యత్వంతో కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి చేయడంలో క్రియాశీలకంగా ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ.. కేంద్రం బియ్యం ఎగుమతులపై నిషేధం విధించక మునుపు లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్‌సీ)లు ఉన్నవే కావడం గమనార్హం. కేంద్రం అనుమతించినా రాష్ట్ర ప్రభుత్వం మోకాలడ్డడాన్ని ఎగుమతిదారులు ఆక్షేపిస్తున్నారు. అంతర్జాతీయంగా బియ్యం ఎగుమతిలో ట్రాక్ రికార్డు ఉన్న కాకినాడ పోర్టు ప్రతిష్టను దెబ్బతీస్తే వేలాది మంది రోడ్డున పడతారు.
కుట్రలతో కుదేలు
గడచిన ఐదేళ్లలో కోటీ 47 లక్షల 55 వేల 837 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతులు ఒక్క కాకినాడ పోర్టు నుంచే జరిగాయి. ఈ స్థాయిలో మరే పోర్టు నుంచి ఎగుమతి జరిగిన దాఖలాల్లేకపోవడం గమనార్హం. ఇంతటి ప్రాధాన్యం ఉన్న కాకినాడ పోర్టుకు చంద్రగ్రహణం పట్టుకుంది. గద్దెనెక్కిన దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు ఈ పోర్టు కార్యకలాపాలను దెబ్బతీస్తున్నాయి. నిన్నమొన్నటి వరకూ దేశంలోనే రికార్డు స్థాయిలో బియ్యం ఎగుమతులు జరిపిన కాకినాడ పోర్టు భవితవ్యం కూటమి ప్రభుత్వ వేధింపులతో ప్రశ్నార్థకంగా మారింది. దీని ప్రభావంతో కాకినాడ పోర్టుపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడ్డ సుమారు 20 వేల మంది రోడ్డున పడే పరిస్థితి ఖాయంగా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment