విశాఖ హోమీ బాబా ఆస్పత్రిలో ఎన్సీజీ ఏపీ చాప్టర్ సెక్రటేరియట్‌ను ప్రారంభిస్తున్న వైద్య శాఖ మంత్రి రజిని(ఫైల్)
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని క్యాన్సర్ రోగులకు ఇకమీదట ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే అధునాతన వైద్యం అందనుంది. క్యాన్సర్ రోగులు వ్యయప్రయాసలకోర్చి ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే మంచి వైద్యం అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వాస్పత్రులు రూపు దిద్దుకుంటున్నాయి. వీటిలో క్యాన్సర్ చికిత్సకు మెరుగైన సౌకర్యాలను కల్పించడానికి, వైద్యులకు అధునాతన చికిత్స పద్ధతులను అందుబాటులోకి తేవడానికి కీలకమైన ముందడుగు పడింది.
రాష్ట్రంలో నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ (ఎన్‌సీజీ) ఏపీ చాప్టర్‌ను వైద్య శాఖ ప్రారంభించింది. ఎన్‌సీజీ నెట్‌వర్క్‌లోకి రాష్ట్రంలోని 11 ప్రభుత్వ బోధనాస్పత్రులను తీసుకెళ్లింది. ఎన్‌సీజీ చాప్టర్‌ను తొలుత కేరళలో ఏర్పాటు చేయగా, రెండో రాష్ట్రంగా ఏపీ ఘనత సాధించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న బోధనాస్పత్రుల్లోని క్యాన్సర్ విభాగాల్లో పనిచేస్తున్న వైద్యులు, లైబ్రరీలోని సమాచారం, ఇతర వివరాలను ఎన్‌సీజీకి అప్‌డేట్ చేస్తున్నారు.
ఇది ముగిసిన తర్వాత ఎన్‌సీజీతో ఆస్పత్రులకు యాక్సెస్ లభిస్తుంది. దీంతో క్యాన్సర్ చికిత్సకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలు, వైద్యులు, పరిశోధకులతో మన వైద్యులు సంప్రదింపులు జరపవచ్చు. తద్వారా వ్యాధికి సంబంధించి నూతన పరిజ్ఞానం, ఇతరత్రా వివరాలను తెలుసుకొని, అధునాతన చికిత్సను రాష్ట్రంలోని రోగులకు అందజేసే అవకాశం కలుగుతుంది.
క్యాన్సర్ కేర్‌లో అసమానతల తొలగింపునకే ఎన్‌సీజీ
డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద టాటా మెమోరియల్ సెంటర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం 2012లో ఎన్‌సీజీని ఏర్పాటుచేసింది. దేశంలో క్యాన్సర్ కేర్‌లో అసమానతల తొలగింపే దీని ప్రధాన లక్ష్యం. దేశవ్యాప్తంగా 266 ప్రముఖ క్యాన్సర్ ఆస్పత్రులు, పరిశోధన కేంద్రాలు ఈ నెట్‌వర్క్‌లో ఉన్నాయి.
క్యాన్సర్ వ్యాధికి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించడంపై నిరంతరం కసరత్తు జరుగుతుంది. క్యాన్సర్ నివారణ, రోగనిర్ధారణ, చికిత్స, రోగుల సంరక్షణ, ఆంకాలజీలో ప్రత్యేక శిక్షణ, వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచడం వంటి అంశాలపై ఏకరీతి ప్రమాణాల ఏర్పాటుకు ఇది కృషి చేస్తుంది.
ఎన్‌సీజీలో భాగస్వామ్యంతో ప్రయోజనాలివీ..
► అంతర్జాతీయంగా, దేశవ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ వ్యాధి నిపుణులు, ఆస్పత్రులు, పరిశోధన సంస్థలతో సంప్రదింపులకు అవకాశం ఉంటుంది. అభిప్రాయాలు, చికిత్స విధానాలను ఒకరికొకరు పంచుకోవడానికి వీలుంటుంది.
► దేశంలో ఎక్కడ నుంచైనా రోగులకు పరీక్షలు, చికిత్స, సంరక్షణ తదితర అంశాలపై నిపుణుల అభిప్రాయాలు పొందవచ్చు.
► ప్రభుత్వాస్పత్రుల్లో క్యాన్సర్ చికిత్స, నిర్ధారణ పరికరాలు, మందులను తక్కువ ఖర్చుతో పొందవచ్చు.
► ఎన్‌సీజీ సెక్రటేరియట్ ద్వారా క్యాన్సర్ పరిశోధనలు, చికిత్సకు సంబంధించిన గ్రంథాలయం మన వైద్యులకు అందుబాటులోకి వస్తుంది. దీనిద్వారా ప్రపంచవ్యాప్తంగా వస్తున్న నూతన చికిత్సా విధానాలు, మందులు, ఇతర అంశాలను తెలుసుకోవచ్చు.
► క్యాన్సర్ చికిత్సలో కీలకమైన ప్రణాళిక రచనలో ముఖ్య పాత్ర పోషించే ట్యూమర్ బోర్డుతో ప్రభుత్వాస్పత్రులకు యాక్సెస్ లభిస్తుంది.
క్యాన్సర్‌ను ఎదుర్కోవడంలో ఎన్‌సీజీ కీలకపాత్ర
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్ ముఖ్యమైనది. దేశంలో దీనిని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఎన్‌సీజీ కీలకపాత్ర పోషిస్తోంది. ఎన్‌సీజీ స్టేట్ చాప్టర్‌ను ఏపీ ప్రభుత్వం ప్రారంభించడం అభినందనీయం. ఏపీలో క్యాన్సర్ వ్యాధి నియంత్రణ, ఏకరీతి చికిత్స ప్రమాణాలతో ముందుకు వెళ్లడానికి ఇది ఎంతగానో అవకాశం కలి్పస్తుంది.
– డాక్టర్ ఎం. ఉమేశ్, డైరెక్టర్, హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్, విశాఖపట్నం
కీలక ఘట్టం
రాష్ట్ర వైద్య శాఖ చరిత్రలో ఇది కీలక ఘట్టం. క్యాన్సర్ చికిత్సలో ప్రపంచవ్యాప్తంగా మార్పులు వస్తున్నాయి. వ్యాధిపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. (ఎన్‌సీజీ) లైబ్రరీలో పరిశోధనలు, కొత్త కొత్త చికిత్సల సమాచారం ఉంటుంది. ఆ నెట్‌వర్క్‌లోకి మన ఆస్పత్రులు వెళ్లడంతో మన వైద్యులకు చికిత్స, వ్యాధి నియంత్రణలపై మరింత అవగాహన పెరుగుతుంది.
– నవీన్‌కుమార్, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment